Telangana Electricity Bills: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై మరోసారి ట్రూ-అప్ చార్జీల భారం పడనుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ కొనుగోలు వ్యయం, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ సర్దుబాటు మొత్తాల కింద రూ.7,635.22 కోట్ల వసూళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అదనపు చార్జీల వసూళ్లు ఈ ఏడాది నవంబర్ నుంచి జారీచేసే కరెంట్ బిల్లుల ద్వారా ప్రారంభం కానున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వ్యవసాయ రంగానికి ఈ చార్జీల నుంచి కమిషన్ పూర్తి మినహాయింపు ఇచ్చింది. మొత్తం రూ.7,635.22 కోట్లలో వ్యవసాయ రంగానికి వాటాగా తేలిన రూ. 2,214.99 కోట్లను ప్రభుత్వం నుంచే సబ్సిడీ రూపంలో వసూలు చేయాలని ఈఆర్సీ డిస్కంలను ఆదేశించింది. ఇందులో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) వాటా రూ. 1,442.49 కోట్లు కాగా, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) వాటా రూ.772.50 కోట్లుగా ఉంది. వ్యవసాయ రంగాన్ని మినహాయించగా మిగిలిన రూ.5,420.23 కోట్ల భారాన్ని గృహ, వాణిజ్య, పారిశ్రామిక తదితర సాధారణ వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఇందులో అత్యధికంగా ఎస్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు రూ.4,222.93 కోట్లు, ఎన్పీడీసీఎల్ వినియోగదారులు రూ. 1,197.30 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
యూనిట్‌కు 30 పైసలు.. ఆ తర్వాత
యోగదారులపై ఒకేసారి తీవ్ర ప్రభావం పడకుండా ఉండేందుకు వీలుగా ఈ వసూళ్లను నెలల వారీగా విభజించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 29 నెలల పాటు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 26 నెలల పాటు ఈ వసూళ్ల ప్రక్రియ కొనసాగనుంది. చార్జీల రేట్ల విషయానికి వస్తే, వసూళ్లు ప్రారంభమయ్యే మొదటి నెలలో యూనిట్‌కు 30 పైసలు చొప్పున, ఆ తర్వాతి నెలల నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున ట్రూ-అప్ చార్జీలను వసూలు చేస్తారు. వినియోగదారులు ఆయా ఆర్థిక సంవత్సరాల్లో వాడిన విద్యుత్ సగటు ఆధారంగా ఈ నెలవారీ భారాన్ని లెక్కించనున్నారు.
ఈఆర్సీ తుది నిర్ణయం..
వినియోగదారుల సౌకర్యార్థం, పారదర్శకత కోసం ఈ ట్రూ-అప్ చార్జీలను బిల్లులోని ఇతర విభాగాలతో కలపకుండా, ఏ ఆర్థిక సంవత్సరానికి ఎంత వసూలు చేస్తున్నారనేది విడిగా లైన్ ఐటెమ్ రూపంలో ప్రత్యేకంగా చూపించాలని కమిషన్ స్పష్టం చేసింది. ఇదిలాఉండగా రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్పీడీసీఎల్) అనే మూడో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు కానుండటం, దానికి సంబంధించిన లైసెన్స్ ప్రక్రియల కారణంగా ఈ ట్రూ-అప్ నిర్ణయంపై గతంలో కొంత కాలం జాప్యం జరిగింది. అయితే, సుప్రీంకోర్టు, ఏపీటీఈఎల్ నిబంధనల ప్రకారం విద్యుత్ చార్జీలు వాస్తవ ఖర్చులకు అనుగుణంగా ఉండాలన్న నిబంధనలు, రెగ్యులేటరీ ఆస్తుల లిక్విడేషన్ గడువును దృష్టిలో ఉంచుకుని ఈఆర్సీ ఈ తుది నిర్ణయాన్ని తీసుకుంది.
Also Read: తెలంగాణ పశుపోషకులకు బిగ్ షాక్.. 12 ఏళ్లయినా తప్పని తిప్పలు!