Ola, Uber, Rapido Users Alert: క్యాబ్ బుక్ చేసుకునే సమయంలోనే డ్రైవర్ కు టిప్ ఇవ్వాలా? ఇకపై ఇలాంటి పద్దతి ఉండదు. ప్రయాణం పూర్తికాకముందే టిప్ చెల్లించే ఆప్షన్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది. వినియోగదారులు తమ ఇష్టంతోనే టిప్ ఇవ్వాలి తప్ప, ముందుగానే చెల్లించేలా ప్రోత్సహించడం, ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాధారణంగా టిప్ అనేది సర్వీస్ నచ్చిన తర్వాత ఇచ్చే అదనపు డబ్బులు. అయితే, కొన్ని రైడ్ హెయిలింగ్ యాప్ లలో ప్రయాణం ప్రారంభించకముందే డ్రైవర్ కు టిప్ ఇచ్చే అవకాశం ఉండటంపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ముందుగానే టిప్ ఇవ్వకపోతే తమకు రైడ్ దొరకడంపై ప్రభావం పడుతుందేమోనని కొందరు వినియోగదారులు భావిస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ విధానం వినియోగదారులను నిర్ణయం తీసుకునేలా పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నట్లుగా ఉందని అధికారులు గుర్తించారు.
జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్‌కు టాక్సీ, రైడ్ హెయిలింగ్ సేవలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించారు. అందులో ముందస్తు టిప్పింగ్ అంశం కూడా ప్రధానంగా కనిపించింది. వివరణాత్మక పరిశీలన, విచారణ తర్వాత ప్రయాణానికి ముందే టిప్ చెల్లించే విధానాన్ని నిలిపివేయాలని కేంద్రం అగ్రిగేటర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ పద్ధతి వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని, అన్యాయమైన వ్యాపార విధానంగా పరిగణించినట్లు వెల్లడించింది.
టిప్పింగ్ పూర్తిగా వినియోగదారుడి ఇష్టంపై ఆధారపడాలని కేంద్రం స్పష్టం చేసింది. డ్రైవర్ సర్వీస్ ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత, సర్వీస్ నచ్చితే టిప్ ఇవ్వవచ్చు. ఇవ్వకపోయినా ఎలాంటి ఒత్తిడి ఉండకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అంటే, రైడ్ బుక్ చేసుకునే సమయంలోనే టిప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండకూడదు. ప్రయాణం ముగిసిన తర్వాత మాత్రమే వినియోగదారుడికి ఆ ఆప్షన్ ఉండాలి.
ఈ పరిణామాలకు ముందు రైడ్ హెయిలింగ్ ప్లాట్ ఫామ్ రాపిడోను నిర్వహిస్తున్న రోపెన్ ట్రాన్స్ పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై CCPA రూ.10 లక్షల జరిమానా విధించింది. ముందస్తు టిప్పింగ్, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన అగ్రిమెంట్ నిబంధనలు, వినియోగదారులను ప్రభావితం చేసే డార్క్ ప్యాటర్న్ ల వాడకం లాంటి అంశాలను అధికారులు పరిశీలించారు. రాపిడోతో పాటు ఇతర ప్రధాన రైడ్ హెయిలింగ్ సంస్థల వ్యాపార విధానాలను కూడా CCPA పరిశీలిస్తోంది. ఓలా, ఉబెర్‌కు సంబంధించిన విచారణలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా క్యాబ్, బైక్ టాక్సీ అగ్రిగేటర్ల విధానాలను పరిశీలిస్తున్న అధికారులు ముఖ్యంగా ప్రయాణానికి ముందు టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్ లాంటి అంశాలపై దృష్టి పెట్టారు.
Read Also: డ్రైవర్ అవసరం లేదు.. గంటకు 90 కి.మీ వేగం.. కొత్త మెట్రో రైళ్లు వచ్చేస్తున్నాయ్!