సీఎంఆర్ఎఫ్లో నయా రికార్డ్
⦿ ఏడాదిలో రూ.830 కోట్ల సాయం
⦿ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఔదార్యం
⦿ 1.66 లక్షల కుటుంబాలను ఆదుకున్న ప్రజా ప్రభుత్వం
⦿ పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు పునర్జన్మ
⦿ సీఎంఆర్ఎఫ్‌లో గతంలో జరిగిన అవకతవకలకు చెక్
⦿ రేవంత్ పాలనలో సాయంలోనూ సరికొత్త రికార్డులు
హైదరాబాద్, స్వేచ్ఛ: CM Revanth Reddy: ‘‘వందమందితో పోరాడితే వీరుడంటారు.. అదే ఒక్కరి ప్రాణం కాపాడినా దేవుడంటారు’’. ఇది సినిమా డైలాగే అయినా నిజ జీవితంలో మంచి చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ సూట్ అవుతుంది. ప్రజా ప్రభుత్వంలో ఇదే మాదిరి ఎందరికో దేవుడిలా మారారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించటంలో ముఖ్యమంత్రి కొత్త రికార్డ్ నెలకొల్పారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు రూ.830 కోట్లు సీఎంఆర్ఎఫ్ విడుదల చేశారు. లక్షా 66వేల పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలబడ్డారు.
గతంలో ఏడాదికి రూ.480 కోట్లే
2018 నుంచి 2023 వరకు అయిదేండ్లలో అప్పటి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2,400 కోట్ల సాయం అందించింది. అంటే, ఏడాదికి రూ.480 కోట్లు ఖర్చు చేసింది. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం డబుల్ సాయం చేశారు. ఈ ఏడాది కాలంలో రూ.830 కోట్ల సాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రజలకు ఆపద వచ్చినా, విపత్తులు సంభవించినా ఆదుకునేందుకు నేనున్నానంటూ అభయ హస్తం అందించారు. ఈ ఏడాది ఇచ్చిన రూ.810 కోట్లలో రూ.590 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించటం గమనార్హం. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం అవసరమైతే ప్రజా ప్రతినిధుల సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ సాయం అందిస్తుంది.
బాధల్లో అండగా నిలిచే ప్రభుత్వం
కొన్ని వ్యాధులకు జిల్లా స్థాయిలో అవసరమైన వైద్య చికిత్స సదుపాయం అందుబాటులో లేక హైదరాబాద్‌లోని పెద్ద ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేక ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో ముందుగానే సీఎం సహాయ నిధిని ఆశ్రయిస్తారు. అటువంటి సందర్భాల్లో నిమ్స్‌తో పాటు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, నిలోఫర్, ఈఎన్ టీ, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్సలకు అయ్యే అంచనా ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. సీఎం సహాయ నిధి నుంచి సంబంధిత ఆసుపత్రికి ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీ చేస్తుంది.
ఆ 13వేల మందికి సాయం
ఈ ఎల్‌వోసీల జారీలోనూ సీఎం తన ఉదారతను చాటుకున్నారు. ఈ ఏడాదిలోనే 13 వేల మందికి ఎల్‌వోసీలు జారీ చేశారు. సుమారు రూ.240 కోట్ల ఎల్‌వోసీలు మంజూరు అయ్యాయి. ఇందులో అత్యధికంగా చిన్న పిల్లలకు అవసరమయ్యే ఆపరేషన్లు, చికిత్సలకు కేటాయించారు. ప్రాణాపాయంలో ఎవరున్నా సరే, వైద్య చికిత్స అత్యవసరమని గుర్తించిన ప్రజా ప్రభుత్వం ఎల్‌వోసీ జారీని వేగవంతం చేసింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఇచ్చే ఏర్పాట్లు చేసింది. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయవద్దని, ఆదివారంతో పాటు సెలవు దినాల్లో కూడా ఎల్‌వోసీలు క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గత ప్రభుత్వంలో అవినీతిమయం
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధులకు కూడా అవినీతి చీడ పట్టుకుంది. పేదల పేరిట మెడికల్ బిల్లులు సృష్టించి నిధులను దిగమింగే దందా వెలుగులోకి వచ్చింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంఆర్ఎఫ్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసింది. పారదర్శకంగా దరఖాస్తులను కూడా ఆన్‌లైన్‌లోకి తెచ్చింది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తుదారులే తమ సీఎంఆర్‌ఎఫ్ సాయం ఏ దశలో ఉందో, ఎప్పటికప్పుడు స్టేటస్‌ను తెలుసుకునేలా ఆన్‌లైన్ వ్యవస్థను రూపొందించింది.
గతంలో కొందరు ప్రజాప్రతినిధుల ఆఫీసుల్లో పని చేసిన సిబ్బంది సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు తమ ఖాతాల్లో వేసుకున్నారు. అటువంటి లొసుగులకు అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా చెక్కులపై లబ్దిదారుల పేర్లతో పాటు వారి బ్యాంక్ ఖాతా నెంబర్‌ను రేవంత్ సర్కార్ ముద్రిస్తోంది. హాస్పిటల్స్ వెరిఫికేషన్ ప్రక్రియను కఠినతరం చేసి, దొంగ బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేయడాన్ని నిరోధించింది. నిజమైన అర్హులకు మాత్రమే సీఎం సహాయ నిధి అందే ఏర్పాట్లు చేసింది.
ఆ పిల్లలకు పునర్జన్మ
పుట్టుకతోనే ఈఎన్‌టీ(మూగ, చెవుడు) సమస్యలతో ఉన్న పిల్లలకు ఆరేండ్ల లోపల శస్త్రచికిత్సలు చేయించాల్సి ఉంటుంది. అవసరమైన వినికిడి పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. లేకుంటే వారు జీవితాంతం మూగవారిగా ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ ఆపరేషన్ల ఖరీదు లక్షల్లో ఉండడంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చేయించుకోలేకపోతున్నారు. అలాంటి పిల్లలు జీవితాంతం చెవులు వినపడక, మాటలు రాని అభాగ్యులుగా ఉంటున్నారని తొలి సమీక్ష సమావేశాల్లోనే వైద్యారోగ్య శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి తెలంగాణలో భవిష్యత్తు తరాల్లో చెవిటి, మూగ పిల్లలు ఉండకూడదని, అటువంటి పరిస్థతి పునరావృతం కాకుండా ఎంత ఖర్చయినా ప్రభుత్వమే చికిత్సలు చేయిస్తుందని ఆదేశించారు. ఎల్‌వోసీలు ఇచ్చి అటువంటి పిల్లలను ఆదుకోవాలని అధికారులకు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 87 మంది పిల్లలకు ఎల్‌వోసీ ఇచ్చి ఆపరేషన్లు చేయించారు. ఇది తమ పిల్లలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన పునర్జన్మ అని తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.