Telangana Govt: తెలంగాణలో మహిళలకు శుభవార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళల జీవితాల్లో మార్పులకు వేదిక కాబోతోంది. మహిళలకు మేలు చేసే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకుంది. మహిళలకు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోంది. తాజాగా జులై 12 నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతోంది.
కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. దీన్ని పక్కాగా అమలు చేస్తోంది. ఈ విషయంలో మంత్రి సీతక్క కూడా అన్నీ దగ్గరుండి చూసుకుంటూ.. మహిళలకు మేలు జరిగేలా, కీలక పథకాలు అమలయ్యేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జులై 12 నుంచి తెలంగాణ వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలకు సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమం మొదలుకానుంది.
ప్రతీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మహిళలు రుణాలను తప్పక తీసుకోవాలని కోరుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసింది. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా మహిళలు లబ్దిపొందుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు వడ్డీ లేని రుణాల చెక్కులు ఇచ్చింది. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందుకోవాలని సూచన చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
శనివారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న ఆయన, 151 మండలాల మహిళా సంఘాలకు ఆర్టీసీ నుంచి రావాల్సిన రూ.1.05 కోట్ల చెక్కును అందజేశారు. తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. త్వరలో మహిళల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామన్నారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న హామీ ఇంకా అమలు కాలేదన్నారు.
ALSO READ: దమ్ముంటే అసెంబ్లీకి రా.. కేటీఆర్ కి కాంగ్రెస్ నేతల సవాల్
మొదటి ఏడాది పాలనలో మహిళలకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతీ ఏడాది కంటిన్యూ అవుతుందని చెప్పకనే చెప్పేసింది. వడ్డీ లేని రుణాల వల్ల ఎక్కువ మంది మహిళలకు ఆ ప్రయోజనం కలగనుంది. మా వార్షిక లక్ష్యం మహిళా సంఘాలకు కనీసం 20,000 కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది.
కేవలం ఒక పథకం కాదన్నారు డిప్యూటీ సీఎం. విద్య, రవాణా, ఇంధనం వంటి విభాగాల్లో స్వయం సహాయక సంఘాలకు ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాపార ప్రణాళికలను సిద్ధం చేయడానికి జూలై 7 నుంచి 9 మధ్యలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో స్వయం సహాయక సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు డిప్యూటీ సీఎం. ఈ లెక్కన వచ్చే వారం నుంచి మహిళలు సిద్ధంగా ఉండాలి. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. దాదాపు దశాబ్దం తర్వాత ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుండడంతో మహిళా సంఘాల్లో ఆనందం మిన్నంటింది.