Graduate MLC: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై భారతీయ జనతా పార్టీలో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ స్థానం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేరు వినిపిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా.. అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాంచందర్‌రావు తన సన్నిహితుల వద్ద సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు పలువురు ఆశావహులు టికెట్ కోసం లాబీయింగ్ చేస్తుండగా.. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడే బరిలోకి దిగుతారన్న ప్రచారం కమలదళంలో హాట్‌టాపిక్‌గా మారింది. రాంచందర్‌రావు గతంలో ఇదే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో మరోసారి అదే స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపితే పార్టీకి సుపరిచతం కావడం, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు కూడా కావడం వల్ల విజయతీరాలకు చేరుకోవచ్చనే అభిప్రాయం మేరకు అధిష్టానం ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రాంచందర్‌రావు పేరు తెరపైకి రావడంతో ఇప్పటివరకు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఉత్కంఠ పెరిగింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాశ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా డీకే అరుణకు సన్నిహితుడిగా ఉన్న డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి పేరు కూడా రేసులో ఉంది. వారితో పాటు సీనియర్ నేత ప్రకాశ్ రెడ్డి, పార్టీ వివిధ విభాగాల సమన్వయకర్త అమర్‌నాథ్ సారంగుల, ఇతర నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు తమ తమ స్థాయిలో పట్టభద్రులను కలుస్తూ, పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకే స్థానానికి ఆశావహులు పెరగడం బీజేపీ నాయకత్వానికి అభ్యర్థి ఎంపికను కీలకంగా మార్చింది. ఒకవేళ రాంచందర్‌రావునే అభ్యర్థిగా అధిష్ఠానం ఖరారు చేస్తే.. ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి ఏమవుతుంది? అన్న ప్రశ్న కూడా పార్టీలో చర్చకు వస్తోంది. ఎమ్మెల్సీ బరిలోకి రాష్ట్ర అధ్యక్షుడిని దింపిన పక్షంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించే అవకాశం ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ప్రస్తుతానికి పార్టీ అంతర్గత చర్చలకే పరిమితమని, రాంచందర్‌రావు అభ్యర్థిత్వం ఖరారైన తర్వాతే రాష్ట్ర అధ్యక్ష పదవిపై తదుపరి నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also read: మార్కెట్‌లో నకిలీ రాజ్మా.. కొనేముందు ఇలా గుర్తించండి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. మరోవైపు బీఆర్‌ఎస్ కూడా ఈ సీటుపై దృష్టి పెట్టి ఓటర్ల నమోదుపై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసింది. కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు తాజా సమాచారం. దీంతో మూడు ప్రధాన పార్టీలూ ఈ సీటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ, పట్టభద్రుల నమోదు తదితర ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేగం పుంజుకున్నాయి. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఇప్పటికే దృష్టి సారించింది. సంబంధిత స్థానాలకు పార్టీ ఇన్‌చార్జీలను నియమించి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. పట్టభద్రులు, ఉద్యోగులు, యువతతో అనుసంధానం పెంచుకునే దిశగా పార్టీ నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే.. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ ఈ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పోరెడ్డి కిశోర్ రెడ్డి, డాక్టర్ వీ పుల్లారావ్ యాదవ్ తదితరుల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఒకే స్థానానికి పలువురు ఆశావహులు ఉండటంతో అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం నిర్ణయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు కమలదళంలో ఉత్కంఠ నెలకొంది. స్థానికంగా పార్టీ బలాబలాలు, అభ్యర్థుల రాజకీయ అనుభవం, పట్టభద్రుల్లో ఉన్న పరిచయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాంచందర్‌రావు, ఎన్వీ సుభాశ్, పవన్‌కుమార్‌రెడ్డి, అమర్ నాథ్ సారంగుల.. ఇలా పేర్లు వరుసగా వినిపిస్తున్నా తుది నిర్ణయం మాత్రం బీజేపీ అధిష్ఠానానిదేనని చెబుతుండటం గమనార్హం. అయితే.. అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరును హైకమాండ్ పరిశీలనలోకి తీసుకురావడం ద్వారా ఈ సీటుపై పార్టీ ఎంతటి ప్రాధాన్యం ఇస్తోందన్నది కొత్త చర్చకు దారితీసింది.
Also Read: అవకాశవాదులు.. ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు సంపాదించే మార్గాన్ని త్వరగా గుర్తిస్తారు