Power Demand: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీ ఎస్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ డిమాండ్ కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం 3:52 గంటలకు 12,044 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదై సంస్థ చరిత్రలోనే సరికొత్త రికార్డును లిఖించింది. ఇంతకుముందు ఈనెల 11న 11,828 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదవ్వగా.. తాజాగా నమోదైన డిమాండ్‌తో ఆ రికార్డును బ్రేక్ చేసినట్లయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈనెల 28న 4,072 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ సాయంత్రం 6:42 గంటలకు నమోదవగా, 82.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకు నమోదైన గరిష్ట డిమాండ్ 4,782 మెగావాట్లు. ఇది మే 22న సాయంత్రం 3:33 గంటలకు నమోదైంది. అదే రోజున 101.07 మిలియన్ యూనిట్ల గరిష్ట విద్యుత్ వినియోగం కూడా నమోదైంది.
తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కూడా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ ట్రాన్స్‌కో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ వివరాల ప్రకారం ఈనెల 28న రాష్ట్రంలో 19,133 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ మధ్యాహ్నం 12:56 గంటలకు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 326.70 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 19,543 మెగావాట్లుగా ఉంది. ఇది ఈనెల 9న ఉదయం 10:41 గంటలకు నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలకు, రైతులు సాగు చేస్తున్న వరి, ఇతర పంటలకు అవసరమైన విద్యుత్‌ను ప్రభుత్వం నిరంతరాయంగా అందిస్తోంది. వ్యవసాయ రంగంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణతో విద్యుత్ సరఫరా కొనసాగుతోంది.
Also Read: నా మొదటి లక్ష్యం అదే.. నిజాలు బయటకొస్తాయ్ – యూట్యూబర్ నందన!
రాష్ట్ర ప్రభుత్వం.. విద్యుత్ రంగంలో చేపడుతున్న ముందస్తు ప్రణాళికలు, సబ్‌స్టేషన్ల సామర్థ్య పెంపు, నెట్‌వర్క్ బలోపేతం, ప్రసార, పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ చర్యల ఫలితంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలను ఎలాంటి అంతరాయం లేకుండా తీర్చగలుగుతున్నామని టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో డేటా సెంటర్లు, ఐటీ పార్కులు, పారిశ్రామిక కారిడార్లు, మెట్రో రైలు విస్తరణ, వ్యవసాయ రంగం, పట్టణీకరణ కారణంగా విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం, ట్రాన్స్‌కో, డిస్కంలు సమగ్ర ప్రణాళికలతో విద్యుత్ మౌలిక వసతుల విస్తరణ, నెట్‌వర్క్ సామర్థ్య పెంపు కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ మాట్లాడుతూ.. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను ముందస్తు ప్రణాళికలు, నెట్‌వర్క్ బలోపేతం, సమర్థవంతమైన నిర్వహణ ద్వారా విజయవంతంగా తీర్చగలుగుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ మరియు విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
Also read: మీ కాళ్లు పట్టుకుంటా, దయచేసి పాకిస్తాన్ ప్లేయర్లను ఐపీఎల్‌లోకి తీసుకోండి