Big Stories

Telangana Online Frauds : లక్షలు, లాటరీలు, మెసెజ్‌లు, లింక్స్ చూసి మోసపోవద్దు..

Telangana Online Frauds : హలో.. మీకు కోటి రూపాయల లాటరీ వచ్చింది.. ఈ అదృష్టాన్ని గంటలోపు చేజిక్కించుకోకుంటే.. వృథా అయిపోతుంది. మీ ఫోన్‌కు ఓ మెసేజ్‌ పంపాం.. అందులో ఓ లింక్‌ ఉంటుంది. ఆ లింక్‌ క్లిక్‌ చేసి కోటి రూపాయలు గెలుచుకోండి.. అంటూ ఒక వ్యక్తి ఫోన్‌ చేస్తాడు. అదేంటో తెలుసుకుందామనో.. లేక సాంకేతికత మీద అవగాహన లేకనో ఇవతలి వైపు వ్యక్తి దాన్ని క్లిక్‌ చేస్తాడు. ఇంకేముంది.. అతని అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మాయమవుతాయి.

- Advertisement -

ఇక జరిగిన నష్టాన్ని చూసుకుని నెత్తీ నోరు కొట్టుకోవడం బాధితుని వంతు అవుతుంది. ఇదీ ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన సైబర్‌ నేరాల పరిస్థితి. ఆన్‌ లైన్‌ షాపింగ్‌ పేరిటనో, లేక బ్యాంకు సీవీవీ పేరిటనో, నకిలీ లాటరీలు, గిఫ్ట్‌ మనీల పేరిటనో వందలాది మంది మోసపోతూనే ఉన్నారు.

- Advertisement -

దేశవ్యాప్తంగా ఈ ఆన్‌లైన్‌ మోసాల తీవ్రత పెచ్చుమీరుతుండగా.. తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 2021 లో దేశవ్యాప్తంగా 14 వేల 7 కేసులు నమోదుకాగా.. ఒక్క తెలంగాణలోనే 7 వేల 3 కేసులు నమోదయ్యాయి. అంటే సరిగ్గా సగం అన్నమాట. ఈ మాట వేరెవరో చెప్పింది కాదు. రాజ్యసభలో ఎంపీ సతీష్‌ చంద్ర దూబే అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రా ఈ మేరకు సమాధానమిచ్చారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆన్‌లైన్‌ మోసాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా.. మహారాష్ట్ర రెండో స్థానంలో, బీహార్‌ మూడో స్థానంలో నిలిచాయి. ఈ గణాంకాల ప్రకారం తెలంగాణలో ఈ తరహా మోసాలు ఏటికేడాది పెరుగుతూనే ఉన్నాయి. 2019 లో 282 కేసులు నమోదు కాగా… 2020 లో ఈ సంఖ్య 3 వేల 316 కు పెరిగింది. ఇక 2021 లో ఈ సంఖ్య ఏకంగా 7 వేల 3 కు చేరింది. ఈ కేసుల్లో 579 మంది సైబర్‌ నేరగాళ్లపై ఛార్జిషీటు నమోదైనట్లు తెలుస్తోంది.

నేరాలు వేల సంఖ్యలో నమోదవుతున్నా.. కేసుల్లో శిక్షలు పడుతున్న నేరస్థుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటోంది. 2020 లో 3 వేల 316 కేసులు నమోదు కాగా.. కేవలం 202 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్ష పడింది. అయితే సైబర్‌ నేరాల్లో నేరస్తులను గుర్తించడం అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. నేరస్తుల వివరాల గుర్తింపు, నేరాలకు సంబంధించిన ఆధారాల సేకరణ చాలా కఠినమైన పని అని చెబుతున్నారు. పైగా ఇందులో సైబర్‌ టెర్రరిజం కేసులకు మాత్రమే యావజ్జీవ శిక్ష ఉండగా.. మిగతా వాటికి కేవలం మూడేళ్ల వరకే శిక్షలు విధించవచ్చని చెబుతున్నారు.

సైబర్‌ నేరాల నియంత్రణ అనుకున్నంత సులువైన పని కాదు. అందరి చేతుల్లోనూ ఫోన్‌ ఉంటుంది. అందరికీ సాంకేతికత అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎవరు మంచివారో.. ఎవరి ఉద్దేశాలు చెడుగా ఉంటాయో చెప్పడం కష్టం. కాబట్టి.. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలే అప్రమత్తంగా ఉండాలంటున్నారు సాంకేతిక నిపుణులు. పరిచయం లేని వ్యక్తుల కాల్స్‌కు స్పందించకపోవడం, ఎవరికీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల పిన్‌ నంబర్లు చెప్పకపోవడం, ఫోన్లో వచ్చే సంబంధం లేని లింకులను క్లిక్‌ చేయకపోవడం, క్యూ ఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసేటప్పుడు జాగ్రత్త వహించడం ద్వారా… సైబర్‌ మోసాలను దాదాపుగా అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News