Public Schools: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టీపీఎస్) ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఈనెల 17న ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మంచి మైలేజీ వచ్చింది. దీంతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.
వీటిలో ఆరుట్ల టీపీఎస్ మినహా మంచాల, వంగూరు, పోల్కంపల్లి టీపీఎస్‌లపై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన పాఠశాలల నిర్మాణ పనులను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలని విద్యా కమిషన్‌కు సూచించారు. దీంతో తెలంగాణ విద్యా కమిషన్ మూడు నెలల టైమ్‌బౌండ్ ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన పనులను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వంగూరు, పోల్కంపల్లి, మంచాల టీపీఎస్‌లలో ఆధునిక తరగతి గదులు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ ల్యాబ్‌లు, సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు, పరిశుభ్రమైన క్యాంపస్ వాతావరణం వంటి అన్ని మౌలిక సదుపాయాలతో ఈ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా అధికారులు వేగంగా పని చేస్తున్నారు.
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రత్యేక పర్యవేక్షణలో ఇప్పటికే ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ పూర్తైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పైలెట్ ప్రాజెక్టులోని మిగిలిన మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రాజెక్టుల పనుల్లో విద్యా కమిషన్ వేగం పెంచింది. వంగూరు, మంచాల, పోల్కంపల్లి టీపీఎస్‌లలో నిర్మాణ పనులు, నాణ్యత, టైమ్‌లైన్ అమలును నిరంతరం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు కమిషన్ సభ్యులు పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వంగూరు టీపీఎస్ పర్యవేక్షణ బాధ్యతలను డాక్టర్ చారకొండ వెంకటేష్, మంచాల టీపీఎస్ పనులను జ్యోత్స్న శివారెడ్డి, పోల్కంపల్లి టీపీఎస్ నిర్మాణాలను ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్ రావు నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
Also read: Nitin Nabin: బీహార్ వలస కార్మికులతో నితిన్ నబీన్ రహస్య మీటింగ్.. బీజేపీ వేసిన స్కెచ్ ఇదే..?
మూడు నెలల్లో ఈ మూడు పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న నేపథ్యంలో విద్యా కమిషన్ ఆయా ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. దీని కోసం అక్కడ సాగుతున్న నిర్మాణ పనులను విభజించి, స్కూల్ ప్రిన్సిపల్ నేతృత్వంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ) సభ్యులకు పనుల విభజన చేస్తోంది. ప్రతి పనికి ముగ్గురు చొప్పున ఎస్‌ఎంసీ సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిర్మాణాల పురోగతి, నాణ్యత, అవసరమైన సదుపాయాల కల్పనను ఎప్పటికప్పుడు సమీక్షించేలా నిర్ణయం తీసుకుంది. ప్రతి బుధవారం, శనివారం ఎస్‌ఎంసీ సభ్యులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిని విశ్లేషిస్తున్నారు. ఎక్కడా జాప్యం లేకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రతి నిర్మాణ దశకు ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించి ఎస్‌ఎంసీ సభ్యులను విద్యా కమిషన్ మానిటరింగ్ చేస్తోంది.
ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యా వాతావరణం కల్పించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ఆరుట్ల టీపీఎస్‌కు లభిస్తున్న ఆదరణ, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్లు, ముఖ్యమంత్రి విధించిన మూడు నెలల గడువు ఈ మూడు అంశాలు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రాజెక్టుకు మరింత వేగాన్ని తీసుకొస్తున్నాయి. ఈ మూడు పైలెట్ ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తైతే రాష్ట్రంలో ప్రభుత్వ విద్య నాణ్యత పెంపునకు ఈ ప్రాజెక్టు కీలక మలుపు కానుంది.
Also read: Rythu Bharosa: తెలంగాణ రైతన్నల గుండెల్లో లబ్ డబ్ గుబులు.. మళ్లీ కోతలు తప్పవా..?