Vehicle Fitness Certificate: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రావాణాశాఖ ముమ్మర కసరత్తు చేస్తుంది. వారం రోజుల్లో టెండర్లు కంప్లీట్ చేయాలని భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 37 స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఏర్పాటు చేయబోతుంది. ఈ కేంద్రాలు ఏర్పాటు అయితే పిట్ నెస్ సర్టిఫికెట్ ఉంటేనే వాహనాలు రోడ్డు ఎక్కనున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు సైతం తగ్గనున్నాయి.
ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, జేసీబీలు లాంటి ఏ వాహనానికైనా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి. వాటి జారీకి రవాణా శాఖ అధికారులు వాహనాన్ని సమూలంగా పరీక్షిస్తారు. రాష్ట్రంలో ఇన్నాళ్లుగా మ్యానువల్‌గా జరుగూతూ వచ్చిన ఈ పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం ఆధునికతను జోడించబోతుంది. ఏ వాహనాన్నైనా ఆటోమేటెడ్‌గా పరిక్షించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందించే నూతన పద్ధతికి శ్రీకారం చుడుతుంది. ఇందుకు అవసరమైన ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒకటి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లో 4 అదనపు స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఆర్ అండ్ బీ శాఖద్వారామొత్తం రూ.296 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం జీఓ28, 2024 సెప్టెంబర్ 30న న పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అయితే టెండర్లు కంప్లీట్ కాకపోవడంతో పెండింగ్ లో పడింది. అయితే ఇప్పుడు రవాణాశాఖ స్పీడ్పెంచింది. వారం రోజుల్లో టెండర్ కంప్లీట్ చేసి ఎటీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం వీటి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటిదశలో15 చోట్లఏటీఎస్ లనుఏర్పాటుచేస్తామని, ఉమ్మడి జిల్లాకేంద్రాల్లో ఒకటి, జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ పరిధిలో మిగిలినవి ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు. 2024-2025 ఆర్థికసంవత్సరంలో, తెలంగాణ ప్రభుత్వం 37 ఏటీఎస్ లకుప్రాథమికరిజిస్ట్రేషన్సర్టిఫికేట్లనుజారీచేసిందని ప్రకటించింది.
Also Read: CM Revanth Reddy: పదవుల్లో మార్క్.. నమ్మిన నేతలకు వరుసగా పోస్టులు ఇస్తున్న సీఎం..?
ఇప్పటి వరకు కొందరు మోటారు వెహికిల్ ఇన్స్‌ప్టెక్టర్లు నామమాత్రంగానే తనిఖీలు చేసి ఫిట్‌నెస్ ధ్రువపత్రం ఇచ్చేవారు. దాంతో ఇంజిన్ లేక బ్రేకో ఫెయిలై ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. ఏటీఎస్ రాకతో ఈ పరిస్థితి పూర్తిగా మారుతోంది. వాహనం పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉంటేనే రోడ్డెక్కుతుంది. ఇందుకు వాహనదారులు తొలుత ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత రుసుం చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకుని వెళ్లాలి. నిపుణులు వాహనాన్ని పరిశీలించి సవ్యంగా కనిపిస్తేనే ఏటీఎస్ కేంద్రంలోని కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం పంపిస్తారు. ఏటీఎస్ కేంద్రంలో 9 రకాల పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో తొలుత కాలుష్యం వెదజల్లడాన్ని గుర్తించేందుకు పొల్యూషన్ టెస్ట్ చేస్తారు.
పొల్యూషన్ టెస్ట్ తర్వాత వాహనం టైర్ల అమరిక సరిగా ఉందా లేదా అని నిర్థారించేందుకు రెండో పరీక్షగా స్లిప్‌టెస్ట్ చేస్తారు. షాక్ అబ్జర్వర్ల పటిష్ఠతను పరీక్షిస్తారు. అనంతరం మూడో పరీక్షగా స్పీడ్ టెస్ట్ చేస్తారు. దీంట్లో వాహనం నిర్దేశించిన వేగాన్ని నిర్ణీత సమయానికి అందుకుంటుందా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. వాహన వేగాన్ని కంప్యూటర్‌లో నమోదు చేస్తూ అదే వేగాన్ని స్పీడోమీటర్‌లోనూ నమోదవుతుందా లేదా అనే విషయాన్ని కంప్యూటర్ పరికరాలు, అధునాతన వ్యవస్థ ద్వారా నిర్థారించి ఆ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహన తయారీ సంస్థ నిర్దేశించిన హరన్‌ను మాత్రమే వినియోగించాలి. దీన్ని తెలుసుకునేందుకు ఏటీఎస్ లో నాల్గో పరీక్షగా హారన్ టెస్ట్ చేస్తారు. హారన్‌ను మార్పు చేసిన తర్వాత కూడా అధిక డెసిబెల్స్‌తో ధ్వని వెలువడితే కంప్యూటర్ వ్యవస్థ వెంటనే గుర్తించి పరీక్షను ఫెయిల్ చేస్తుంది. తర్వాత ఐదో పరీక్షగా వాహనం బ్రేక్ తనీఖీ పరీక్షను అధునాతన సాంకేతిక పరికరాల సాయంతో చేపడతారు.
ఏటీఎస్ ద్వారా చేసే పరీక్షల్లో కీలకమైన ఆరో పరీక్ష అండర్ పిట్ ఇన్ స్పెక్షన్ వాహనం కింద భాగంలో మెకానికల్ సిబ్బంది వెళ్లి లోపలి ఇంజిన్ సహా గేర్ బాక్స్, ఇతర యంత్రాలు పనితీరును పరికరాల సాయంతో పరిక్షిస్తారు. ఏడో పరీక్షగా జాయింట్ ప్లే టెస్ట్ చేస్తారు. ఇందులో టైర్‌ను 45 డిగ్రీల కోణంలో లిఫ్టుల సాయంతో జరిపి టైర్ల అమరిక సరిగ్గా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. తర్వాత స్టీరింగ్ అమరికను ప్రత్యేక పరికరాల సాయంతో నిర్థారిస్తారు. ఆఖరున తొమ్మిదో పరీక్షగా హెడ్‌లైట్ల టెస్ట్‌ను ప్రత్యేక పరికరాల సాయంతో చేస్తారు. ఏటీఎస్‌లో చేసిన పరీక్షల వివరాలన్నింటినీ వాహన్ వెబ్ సైట్ సర్వర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ వివరాలను అది ఫిట్‌నెస్ ధ్రువపత్రం జారీ చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, విలువలతో పోల్చి చూస్తుంది. అన్నీ సరిగ్గా ఉంటే పరీక్షలో కంప్యూటర్ ఆటోమేటిక్‌గా వాహనం అర్హతను తెలుపుతుంది. విలువల్లో తేడా ఉంటే వెంటనే ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిల్ ఐనట్లు ప్రకటిస్తుంది. తిరిగి మరమ్మతులు చేసుకొని, ఎలాంటి లోపాలు లేకుండా బండిని మరోసారి తీసుకురావాలని సూచిస్తుంది.
Also Read: Tollywood Actor:పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో.. ఎంగేజ్మెంట్ ఫిక్స్!
ఏటీఎస్ ద్వారా వాహనాల ఫిట్‌నెస్ నమోదులో ఎలాంటి లోపాలకు తావుండదు. వాహనం సమర్థంగా ఉంటే 22 నిమిషాల్లోనే ఫిట్‌నెస్ ధ్రువపత్రం జారీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపైఎలాంటి అనుమానాలు, అపోహలకు ఆస్కారం లేదన్నారు. వాహనదారులు నిర్దేశించిన ప్రమాణాలు ఉంటేనే వాహనాన్ని ఏటీఎస్ కేంద్రాలకు తీసుకురావాలని సూచిస్తున్నారు. రానున్నరోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఏటీఎస్ కేంద్రాల్లోనే ఫిట్‌నెస్ చేసేలా నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఏటీఎస్ కేంద్రాల్లో జరిపే పరీక్షల్లో ఎలాంటి లోపాలు, అనుమానాలకు తావివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిఘా, పర్యవేక్షణ ఏర్పాటు చేశాయి. 9 అధునాతన పరీక్షలనూ సీసీకెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తారు. వాహనానికి సంబంధించి అన్ని కోణాల్లో ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. డేటాను 5 ఏళ్లపాటు భద్రపరుస్తారు. ఏదైనా ఫిర్యాదు వస్తే రవాణా శాఖ అధికారులు ఈ డేటాను పరిశీలించి దర్యాప్తు చేస్తారు. ఫిట్‌నెస్ జారీలో ఏవైనా లోపాలు ఉన్నట్లు తెలితే సంబంధిత ఏటీఎస్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకునే అధికారం కల్పించారు. దీంతో ఎక్కడా లోపాలకు తావివ్వకుండా పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి ధ్రువపత్రాలు జారీ చేయనున్నారు. ఏ అంశాల్లోనైనా లోపాలు ఉంటే వాహనానికి ఫిట్ నెస్ సర్టిఫికెట్ రాదు. ఈ ఏటీఎస్ కేంద్రాలతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.