Abhaya Hastham Scheme : తెలంగాణాలోని చేనేత కార్మికుల్ని ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం రెండు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి… చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ చేనేత అభయహస్తం పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా చేనేతల భవిష్యత్ కు భద్రత, వారి జీవనానికి సాయంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే.. పథకం అమలుకు అనుసరించనున్న మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిస్తూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం..
చేనేత అభయ హస్తం పథకానికి..2024-25 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులో ఉన్న నిధుల వివరాల్ని వెల్లడించిన ప్రభుత్వం.. వివిధ పథకాలకు కేటాయించిన సొమ్ముల వివరాల్ని వెల్లడించింది. దీని ప్రకారం..
తెలంగాణ నేతన్న పొదుపు (త్రిఫ్ట్ ఫండ్)- రూ.15 కోట్లు, పవర్‌లూమ్స్, బకాయిలకు రూ.15 కోట్లు. తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న బీమా) – రూ.5.25 కోట్లు ఉన్నట్లు తెలిపిన ప్రభుత్వం.. తెలంగాణ నేతన్న భరోసా – రూ.31 కోట్లు, వేతన ప్రోత్సాహాకాలు (వేజ్ ఇన్సెంటివ్)-రూ.31 కోట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
తెలంగాణ చేనేత అభయహస్తం కింద సంక్షేమ కార్యక్రమాలకు మార్గదర్శకాలు…
తెలంగాణ నేతన్న పొదుపు
ఈ పథకం జియో-ట్యాగ్ తో అనుసంధానమైన మగ్గాల చేనేత కార్మికులు, అనుబంధ కార్మికుల సంక్షేమానికి రూపొందించారు. ఇది కార్మికుల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడంతో పాటు వారికి సామాజిక భద్రత కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది. చేనేత కార్మికులు/అనుబంధ కార్మికులు వారి వేతనాల నుంచి దీనికి నెలవారీగా 8 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తారు. కాంట్రిబ్యూషన్ గరిష్ట పరిమితి రూ.1200. ఇందుకు ప్రభుత్వం రెండింతలు అధికంగా అంటే 16 శాతం అందిస్తుంది. దీంతో దాదాపు 38 వేల మంది నేత కార్మికులు లబ్ధి పొందనున్నారు.
ఈ పథకం 15 వేల మంది పవర్ లూమ్ కార్మికులకూ వర్తిస్తుంది. మర మగ్గాల కార్మికులు వారి వేతనం నుంచి నెల వారీగా 8 శాతం జమ చేయనుండగా.. వారి గరిష్ట పరిమితి రూ.1200 గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తరఫున కార్మికులతో సమానంగా 8 శాతం వాటాను జమ చేయనున్నారు. రికరింగ్ డిపాజిట్ వ్యవధి మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించారు.
తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న బీమా)
తెలంగాణ నేత భద్రత పథకం రాష్ట్రంలోని జియో ట్యాగింగ్ అయిన మొత్తం చేనేత, మర మగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులకు వర్తిస్తుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. తెలంగాణ నేతన్న భద్రతలో నమోదైన కార్మికుడు ఏ కారణం చేతనైనా మృతి చెందితే… రూ. 5 లక్షల మొత్తం నామినీకి అందనుంది. తెలంగాణ చేనేత కార్మికుల సహకార సంఘం ద్వారా బీమా కవరేజీ అందరికీ వర్తింపజేస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి ఇది వర్తిస్తుంది. ఈ పథకం అమలుకు ఏడాదికి బడ్జెట్ అంచనా వ్యయం రూ.9 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ నేతన్నకు భరోసా– మార్కెట్ అభివృద్ధి
నేత కార్మికులకు వేతన ప్రోత్సాహకం… ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం జియో ట్యాగ్ అయిన మగ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి ప్రమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి గరిష్టంగా రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు వేతన సహాయం అందించనున్నారు. దీంతో కార్మికులకు వేతన మద్దతు లభించడంతో పాటు నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం అమలుకు వార్షిక బడ్జెట్ అంచనా రూ.44 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
తెలంగాణ చేనేత మార్క్ లేబుల్
చేనేత, సిల్క్ మార్క్ మాదిరే ప్రత్యేకమైన లోగో ద్వారా తెలంగాణకు ప్రత్యేకమైన చేనేత మార్క్ లేబుల్ రూపొందించారు. దీని లక్ష్యాలు దేశ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రీమియానికి అనుగుణంగా తెలంగాణ చేనేత ఉత్పత్తులను లేబుల్ బ్రాండింగ్ చేయనున్నారు. తెలంగాణ చేనేత వస్త్రాల ఘన వారసత్వ, సంప్రదాయ ప్రతిష్టను పెంపొందించడం దీని లక్ష్యంగా చెబుతున్నారు.
చేనేత బ్రాండ్ ప్రచారంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు, సముచితమైన మార్కెట్‌ను సృష్టించాలని భావిస్తున్నారు. అలాగే.. తెలంగాణ చేనేత కార్మికుల జీవనోపాధి, సంక్షేమం, అభివృద్దికి మద్దతుగా నిలవడం.. పోటీ మార్కెట్‌ను తట్టుకునేలా తెలంగాణ చేనేత పరిశ్రమ సంప్రదాయ నైపుణ్యాలు, పని తనాన్ని సంరక్షించడం ముఖ్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రత్యేక లేబుల్ ద్వారా తెలంగాణ చేనేత ఉత్పత్తులకు సమష్టి గుర్తింపును అందించడం. తెలంగాణలో చేతితో నేసిన ఉత్పత్తుల ద్వారా కార్మికుల గుర్తింపు ప్రచారమై కొనుగోలుదారులకు ప్రామాణికత, నాణ్యతపరమైన హామీ అందుతుందని అధికారులు అంటున్నారు. ఉత్పత్తి ప్రత్యేకతను పేర్కొనడం ద్వారా ఉద్వేగపూరితమైన, సృజనాత్మక హస్తకళల ముఖ్య లక్షణంగా ఉపయోగపడుతుందంటున్నారు. ఇది పోటీదారుల నుంచి వేరు చేసి వినియోగదారులతో చేనేతను ప్రత్యేకంగా అనుసంధానం అయ్యేలా చేస్తుందని అంటున్నారు.
ఈ పథకాన్ని… తెలంగాణ ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ డైరెక్టరేట్ ద్వారా అమలు చేయనున్నారు. ఇందుకోసం..ఇప్పటికే ప్రత్యేకమైన లోగో ద్వారా “తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్” రూపకల్పన చేసినట్లు తెలుపుతున్నారు. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌కు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అవసరం లేదంటున్న అధికారులు.. జియో ట్యాగ్‌తో అనుసంధానమైన మగ్గాలన్నీ వాటంతటవే రిజిష్టర్ అవుతాయని చెబుతున్నారు. ఇలా జియో ట్యాగ్ అయిన మగ్గాలన్నీ వాటంతటవే రిజిష్టర్ అయిన ఏకైక రాష్ట్రం తెలంగాణ నే అని చెబుతున్నారు.
కొత్త మగ్గాల విషయంలో తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ నమోదుకు ఆన్‌సైట్ వెరిఫికేషన్ చేస్తారని తెలిపిన అధికారులు.. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ లేబుళ్లను ఆయా జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ) సరఫరా చేస్తారని తెలిపారు. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ లేబుళ్లకు వార్షిక బడ్జెట్ రూ.4 కోట్లుగా నిర్థరించారు.
ఈ లేబుల్ లో ఏముండనుంది.
ఎంతో ప్రత్యేకంగా.. చేనేతల కోసం తయారు చేసిన ఈ లేబుల్లో చాలా ప్రత్యేకతలు ఉండనున్నాయి. ముఖ్యంగా.. లేబుల్ ఒక వైపు తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌తో పాటు 9 అంకెల నంబర్ ఉంటుంది. అందులో.. మొదటి రెండు అంకెలు ఆ జిల్లా/ అసిస్టెంట్ డైరెక్టర్ కోడ్‌కు సంకేతాలు కాగా.. తర్వాత రెండు అంకెలు ఆ ఉత్పత్తి ఏడాదిని సూచించనున్నాయి. తర్వాత అయిదు అంకెలు రన్నింగ్ సీరియల్ నెంబర్ తెలియజేస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు. లేబుల్ మరోవైపు కార్మికుడు, ఉత్పత్తి వివరాలు ఉండనున్నాయి.
ఇలా.. సమగ్ర విధానాల ద్వారా చేనేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించి అమలు చేయనుంది. ఈ పథకాలతో.. అన్ని రకాల చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని అంటున్నారు.