రైతులు అప్రమత్తమయ్యారు. ఈ సీజన్‌లో కరువు వెంటాడనుందనే ఆందోళన రైతాంగంలో తీవ్ర చర్చకు తెర తీసింది. ఎక్కడబోయినా ఇదే ముచ్చట. గ్రామాల్లో ఏ నలుగురు కలిసినా… దీనిపైనే చర్చ. ఈసారి వానలు పడవంట కదా! మరి ఎట్లా? లేటుగా నాట్లు వేసుకుంటారట కదా! అని ఒకర్నొకరు ఆరా తీసుకుంటున్నారు.
ఓ వైపు సర్కార్.. మరోవైపు ప్రచార సాధనాల ద్వారా నిత్యం కరువు వార్తలను వింటున్నారు రైతులు. ఈసారి ఎల్ నినోతో తీవ్ర కరువు ఛాయలు ఉంటాయనే డేంజర్ సిగ్నల్ రైతాంగంలో తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే పుటాలు వేసుకుని.. నాట్లకు రెడీ కావాల్సిన చోట.. ఏరువాకతో పొలాలు కనులవిందుగా, పండుగ వాతావరణంలా కనిపించే దృశ్యాలుండాల్సిన వేళ.. అంతా ప్రశాంత మేఘాలు అలుముకుని కనిపిస్తున్నాయి.
ఇలా మురిపించి.. ఆపై మరిపించేలా కనుమరుగై దోబూచులాడే మేఘాల కదలికపై రైతులు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఇదీ ఓ రకంగా మంచిదే. ముందే మేల్కోవడం, అప్రమత్తంగా ఉండటం.. కరువును అనుగుణంగా రైతు ముందడుగు వేయడం.. శుభ సూచకమే అంటున్నారంతా. సర్కార్‌కు కూడా ఇదే కావాల్సింది. ఇప్పటికే రైతు వేదికల ద్వారా రైతులకు ఈసారి విత్తుకోవడానికి కేవలం ఏడు రకాల సన్న రకాల వడ్లనే విత్తనాలుగా సరఫరా చేస్తున్నది సర్కార్.
ఈ విత్తనాలే వేయడం వల్ల.. మార్కెట్లో మంచి గిట్టు బాటు ధర రావడంతో పాటు.. సర్కార్ ఇచ్చే మద్దతు ధర, దీనికి అదనంగా బోనస్ కూడా కలిసి వస్తుందనే విధంగా సర్కార్ రైతులను చైతన్య పరుస్తూ వస్తోంది. దీంతో మెల్లమెల్లగా రైతులు కూడా పరిస్థితులకు తగ్గట్టు తమ ఆలోచనలు కూడా మార్చుకుంటున్నారు. అందుకే ఈసారి క్రాప్ హాలీడే ప్రకటించారు. అంటే ఓ నెల రోజులు ఆలస్యంగా నాట్లు వేసుకుంటారన్నమాట.
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే నాట్లు వేయడం పూర్తయ్యేది. కొన్ని చోట్ల మాత్రమే ఆలస్యంగా వచ్చే నెలాఖరు నాటికి నాట్లు వేసుకుంటారు. మరీ కొన్ని ప్రాంతాల్లో ఆగస్టులో కూడా వేసుకుంటారు. కానీ ఈసారి కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఓ నెల రోజులు ఆలస్యం.. అంటే జూన్ నెలాఖరు వరకు వేసుకునే నాట్లు.. జూలై నెలాఖరు వరకు వేసుకోవాలని అనుకుంటున్నారు. ఇది ఆగస్టు నెలాఖరు దాకా పోయినా ఆశ్చర్యం లేదు.
దీంతో పాటు ప్రత్యామ్నాయ పంటల గురించి కూడా ఆలోచించాలని ప్రభుత్వం సూచిస్తోంది. కానీ రైతులు దీనిపై పెద్దగా ఆసక్తి కనబరుస్తున్నట్టుగా అనిపించడం లేదు. కరువున్నా సరే గానీ, ఆలస్యంగానైనా నాట్లు వేసుకుంటాం.. గానీ వరే వేసుకుంటామనే రీతిలోనే వారి దోరణి కనిపిస్తున్నది. దీంతో గత ఏడాది వానాకాలం సీజన్‌తో పోల్చితే .. వరి సాగు విస్తీర్ణమైతే ఏమాత్రం తగ్గేలా లేదు. మరి ఎంత చేతికి వస్తుందో..? దిగుబడి ఎలా ఉంటుందో..? కరువు ధాటికి ఎంత పంట నష్టపోవాల్సి వస్తుందో.. భూగర్భ జలాల పరిస్థితి ఏమిటో..? ఇవన్నీ కూడా ఎల్‌నినో ద్వారా వానాకాలం సీజన్‌కు ఎఫెక్టు అంశాలే.