Thummidihatti Barrage: ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజీకి ఈ సారైనా మోక్షం లభిస్తుందా..? బ్యారేజీని నిర్మించడానికి తెలంగాణ సర్కారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తుందా… ? అసలు తుమ్మిడిహట్టి దగ్గర ఎన్ని మీటర్లలో బ్యారేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు..? దీని వల్ల మహారాష్ట్రకు ఏమైనా నష్టం ఉందా? అసలు ఫడ్నవీస్ సర్కారును ఎలా ఒప్పించబోతుంది.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం. తెలంగాణ పాలిటిక్స్‌లో దాదాపు 20 ఏళ్లుగా రగులుతున్న అంశం. కొమురం భీం జిల్లాలో ప్రాణహిత నదిపై ఈ బ్యారేజీని నిర్మించాలని ప్రభుత్వాలు ఏళ్లుకేళ్లుగా ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదు. ఈ క్రమంలో ఈ తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఆనకట్టను నిర్మించాలని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్రతో మన ప్రభుత్వం మరో రౌండ్ చర్చలకు సిద్ధమైంది. ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు.
2008లో వైఎస్సార్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ప్రతిపాదించగా, ముంపు కారణాల దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం 2016లో కేసీఆర్ ప్రభుత్వం రీడిజైనింగ్‌లో భాగంగా మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాధాన్యమిచ్చింది. తుమ్మిడిహెట్టి వద్ద ఎత్తును 148 మీటర్లకు తగ్గించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ నిర్మాణం ముందుకు సాగలేదు.
Also read: మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
వాయిస్-తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో 5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాణహిత బ్యారేజీ పునర్నిర్మాణానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తుమ్మిడిహెట్టి గ్రామం దగ్గర వార్థా నదిపై ఒకటి, వెన్‌గంగాపై మరోటి ఎల్-షేప్ కాంప్లెక్స్‌గా బ్యారేజీలు నిర్మించడం వల్ల మహారాష్ట్రలోని శివాని గ్రామం, చాప్రాలా అభయారణ్య పరిధిలో అతి తక్కువ ముంపు మాత్రమే ఉంటుందని పేర్కంటూ మహా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే 70 కిలోమీటర్ల కాలువ సిద్ధంగా ఉండటంతో గ్రావిటీ ద్వారా నీటిని సుందిళ్ల ఎగువకు తరలించి, చిన్న లిఫ్ట్ ద్వారా సుందిళ్ల బ్యారేజీలోకి, అక్కడి నుంచి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్ఎండీ, మల్లన్నసాగర్‌లకు నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 76.65 కిలోమీటర్ల కాలువ, 20.90 కిలోమీటర్ల టన్నెల్ మీదుగా 80 టీఎంసీల నీటిని గ్రావిటీతో సుందిళ్ల బ్యారేజీకి తరలించడం వల్ల ఏటా 383.50 కోట్ల రూపాయల కరెంట్ బిల్లుల భారం తగ్గుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. 152 మీటర్ల ఎత్తుతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా మహారాష్ట్ర గట్టి పట్టు పడితే 150 మీటర్లతో అయినా సమ్మతి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 150 మీటర్లయితే 413 హెక్టార్ల భూసేకరణ, 152 మీటర్లయితే 1,174 హెక్టార్ల భూసేకరణ అవసరమవుతుంది. ఏ ఎత్తులో నిర్మించినా గ్రామాలు ముంపునకు గురికావని తెలంగాణ ప్రభుత్వం లెక్కలు వేసింది. చాప్రాల ఎకో సెన్సిటివ్ జోన్‌తో పాటు నదీ గర్భం ముంపు వివరాలన్నింటినీ ప్రతిపాదనగా సిద్ధం చేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి మన ప్రభుత్వం వివరించనుంది. పుణెకు చెందిన CWPRS సంస్థ సాంకేతిక నివేదిక ఆధారంగా, తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్లకు పెంచినా మహారాష్ట్రలో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదు. కేవలం 2,300-2,500 ఎకరాల అటవీ భూమి మాత్రమే మునుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వివరించనున్నారు. 150 మీటర్ల ఎత్తుతో అయితే ముంపు 1,000 ఎకరాల లోపే ఉంటుందని తెలుపుతూ, బాధితులకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేయనున్నారు.
Also read: ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్.. ఇది ఊహించలేదంటూ!