Turkapalli Accident: పాడి పశువులే జీవనాధారంగా బతుకుతున్న రైతు కుటుంబానికి ఒక్కసారిగా తీరని నష్టం జరిగింది. డీసీఎం వాహనం ఢీకొనడంతో తుమ్మల రాజుకు చెందిన ఆరు గేదెలు మృతి చెందగా.. మరో ఏడు గేదెలకు గాయాలయ్యాయి. ఈ ఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది.
గజ్వేల్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం రహదారిపై ఉన్న గేదెలను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరు గేదెలు మృతి చెందగా.. మరో ఏడు గేదెలు తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. ఆరు గేదెలను కోల్పోయిన తుమ్మల రాజు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. పాడి పశువులే కుటుంబానికి ప్రధాన జీవనాధారం కావడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, స్థానిక రైతులు రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు.
మృతి చెందిన గేదెలకు తగిన పరిహారం అందించాలని, గాయపడిన గేదెలకు వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న జీనోమ్ వ్యాలీ సీఐ గురవయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడా? ప్రమాదానికి అసలు కారణమేంటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Also read: మలేషియాలో బ్యాన్ చేసిన కీర్తి సురేష్ బోల్డ్ మూవీ.. తెలుగులో రిలీజ్, ఎప్పుడంటే?