Vanajeevi Ramaiah Death| పద్మశ్రీ అవార్డు గ్రహీత, పర్యావరణ ప్రియుడు వనజీవి రామయ్య శనివారం తెల్లవారుజామున గుండెపోటు వల్ల కన్నుమూశారు. ఆయన అకస్మాత్తు మరణంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) .. వనజీవి రామయ్యకు సంతాపం తెలియజేశారు.
“ప్రకృతి, పర్యావరణం లేకుండా మానవ జీవనం అసాధ్యం అనే భావనను గాఢంగా నమ్మి.. వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య. వ్యక్తిగతంగా మొక్కలు నాటడం ప్రారంభించి సమాజం మొత్తాన్ని ప్రేరేపించారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటు. పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళులు. ఆయన చూపించిన మార్గం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని” సీఎం పేర్కొన్నారు.
రామయ్య చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2017లో ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య శనివారం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా
ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన రామయ్య (Vanajeevi Ramaiah) ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లిలో జన్మించారు. ప్రకృతిని మిక్కిలి ప్రేమించిన ఆయన తన జీవితంలో కోటిపైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. దీని వలన ఆయన పేరు వనజీవి రామయ్యగా మారిపోయింది. ఆయన పర్యావరణానికి చేసిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
రామయ్యతో పాటు ఆయన భార్య జానమ్మ కూడా ఆయన్ను ప్రతి అడుగులో ప్రోత్సహించారు. ఐదు దశాబ్దాలుగా సామూహిక అడవుల పెంపకానికి వారు నిరంతరంగా కృషి చేశారు. మానవ జీవితానికి విత్తనే మూలమని, ప్రతి ఒక్కరు ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలనే భావనను రామయ్య గాఢంగా నమ్మారు. పలు వేదికలపై ప్రకృతిని రక్షించాల్సిన అవసరం గురించి ప్రజలకు పిలుపునిచ్చారు.
కోటిపైగా మొక్కలు నాటి అపూర్వమైన ఘనత సాధించిన రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రామయ్యను తుదిసారి వీక్షించేందుకు చాలామంది ఆయన రెడ్డిపల్లిలోని ఇంటికి చేరుతున్నారు.
వనజీవి రామయ్య మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖలు
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.. వనజీవి దరిపల్లి రామయ్య మృతిపట్ల శోకం వ్యక్తం చేశారు. కోటికి పైగా మొక్కలు నాటి, ఇంటిపేరు వనజీవిగా మార్చుకొని, పద్మశ్రీ పురస్కారం అందుకున్న రామయ్య మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. రామయ్య జీవితం భవిష్యత తరాలకు స్ఫూర్తి అని అన్నారు.
బీఆర్‌ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్‌లు కూడా రామయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. వృక్షో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ కోట్లాది మొక్కలు నాటి, ఆరోగ్యం క్షీణించినా పర్యావరణ ఉద్యమాన్ని కొనసాగించిన ఆయన జీవితాన్ని నేతలు కొనియాడారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రామయ్య మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాన్ని మొక్కలకు అంకితం చేసిన పర్యావరణ ప్రేమికుడని రామయ్యను కొనియాడారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వనజీవి రామయ్య మృతిని పచ్చదనానికి తీరని లోటుగా పేర్కొన్నారు. వృక్షో రక్షతి రక్షితః నినాదంతో కోటిపైగా మొక్కలు నాటి ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను చాటిన రామయ్య జీవితాన్ని రేపటి తరాలకు ఆదర్శంగా అభివర్ణించారు. హరితహారం కార్యక్రమం విజయవంతం కావడంలో రామయ్య పాత్రను గుర్తు చేశారు. రామయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Share