Warangal District : మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఏ సమస్య ఉన్నా.. ఈ మందులు వాడితే పూర్తిగా నయం చేస్తాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. ఇలాంటి ప్రచారంతో నిత్యం మనకు ఎక్కడో ఓ చోట హెర్బల్ మందులు అమ్ముతూ కనిపిస్తుంటారు. రోడ్డు పక్కన కాస్త జాగా కనిపిస్తే చాలు.. ఓ టెంటు వేసుకుని ఇలాంటి మందుల్ని, మూలికల్ని విక్రయిస్తుంటారు. ఎవరైనా అక్కడ ఆగి.. ఏమిటని అడిగితే చాలు.. మీకు ఎలాంటి జబ్బులు ఉన్నా నయం చేస్తామంటూ చెబుతుంటారు. నిజమే అని నమ్మి మందులు కొనుక్కుంటే.. ఇక అంతే సంగతులు. మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా నాశనం చేసుకున్నట్లు అవుతుంది అంటున్నారు వైద్యులు. అర్హత లేని వ్యక్తులు చెప్పే మాటల్ని, మందుల్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. వారి మాటల్ని నిజమే అనేలా.. వరంగల్ జిల్లాలో ఓ ఘటన జరిగింది. హెర్బల్ మందుల్ని వాడి.. ప్రాణాపాయ స్థితికి చేరుకుంది ఓ మహిళ.
ఏదో అనారోగ్యం ఉంటే ఆసుపత్రులకు వెళ్లాలి. నిపుణులైన వైద్యులు సూచించే మందుల్ని, వైద్యన్ని తీసుకోవాలి. కానీ.. చాలా మంది తెలిసిన వాళ్లు చెప్పారని, ఎవరో వాడారంటూ ఇతర వైద్య మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి వారికి హెచ్చరిక వంటి ఘటనే ఇది. వరంగల్ జిల్లా చెన్నారావు పేటకు చెందిన యాద లక్ష్మీ అనే మహిళకు కొన్నాళ్ల క్రితం మూర్చ వ్యాధి వచ్చింది. ఎలాగ ఈ సమస్య నుంచి బయటపడాలని ఆలోచిస్తుండగా.. హెర్బల్ మందుల గురించి తెలిసింది. దాంతో.. తనకు వ్యాధి నయం అవుతుందని ఆశ పడింది.
యాదలక్ష్మీకి మూర్చ నయం కావాలంటే హెర్బల్ మందులు బాగా పని చేస్తాయని కవిత అనే మహిళ నమ్మించింది. రూ.3 వేల విలువైన హెర్బల్ ఔషధాల్ని కొనేలా ప్రోత్సహించింది. ఆ మందుల్ని ఇంటికి తెచ్చుకున్న యాదలక్ష్మీ వాడిని క్రమం తప్పకుండా వినియోగిస్తోంది. ఇలా మూడు రోజులు వినియోగించిందో లేదో.. యాదలక్ష్మీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మహిళ కళ్లు తెరిచి చూడలేని స్థితికి చేరుకోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు… హుటాుహుటిన వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
ఎలాంటి ప్రమాణాలు, అర్హతలు లేని వ్యక్తులు చెప్పే మాటల్ని నమ్మి మోసపోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనలో హెర్బల్ మందులు వాడిన ఘటనలో బాధిత మహిళకు కిడ్నీ, లివర్ పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుత పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. కాగా.. ఎలాంటి శిక్షణ, అర్హతలు లేకుండా హెర్బల్ మందుల్ని అమ్మే వారి దగ్గర కొనుగోలు చేయవద్దని, వారి మాటల్ని నమ్మి.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెబుతున్నారు.
Also Read : చెరువులో దూకి ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. వీరితో పాటుగా మరో యువకుడు… అసలేమైంది.
ఎవరో చెప్పారనో లేదా ఆసుపత్రులకు వెళ్లితే డబ్బులు ఖర్చవుతాయనే భయంతోనో ఇలా.. రోడ్ల వెంట అమ్మే మందుల్ని వాడితే.. ఇలాగే ప్రాణాల మీదకు తెచ్చుకుంటాని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆయుర్వేద మందులైనా, హోమియోపతి అయినా ప్రభుత్వాలు ఆమోదించిన అర్హులైన వారి దగ్గర మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. లేదంటే.. ప్రాణాల మీదుకు తెచ్చుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.