Warangal Accident: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పిట్టకాలుబోడు తండాలో బుధవారం ఉదయం తీవ్ర విషాదం అలముకుంది. కళ్లముందే ఆడుకుంటున్న మూడేళ్ల పసికందును పాఠశాల బస్సు బలితీసుకోవడంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆటవస్తువు తెచ్చిన ఆపద
తండాకు చెందిన రమేశ్, అఖిల దంపతులకు ఇద్దరు కుమారులు. వారి చిన్న కుమారుడు రాహుల్ (3) ఉదయం తన ఇంటి ముందు సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ ఆడుకుంటున్న బొమ్మ ఎగిరి ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డుపై పడింది. ఆ ఆటవస్తువును తెచ్చుకోవడానికి చిన్నారి రోడ్డుపైకి వెళ్లాడు.
కళ్లముందే విరిగిన నూరేళ్ల ఆయుష్షు
అదే సమయంలో మండల కేంద్రానికి చెందిన ఒక ప్రైవేటు పాఠశాల బస్సు వేగంగా వచ్చి చిన్నారిని ఢీకొట్టింది. బస్సు ముందు, వెనుక టైర్లు రాహుల్ పైనుంచి వెళ్లడంతో ఆ పసిపాప అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదాన్ని చూసి కన్నతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పసికందు మరణంతో పిట్టకాలుబోడు తండాలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం!