Vande Bharat Sleeper Train Update: సుదూర ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 16 కోచ్‌లతో రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైళ్లు నడుస్తుండగా, ఇప్పుడు 24 కోచ్‌లతో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ప్యాంట్రీ కార్‌తో పాటు ప్రయాణికులకు ఉపయోగపడే మరిన్ని సౌకర్యాలను అందించనున్నారు. ఈ కొత్త రైలు 2027లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)కి 24 కోచ్‌లతో కూడిన 50 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ బాధ్యతను అప్పగించారు. ఈ రైళ్లకు సంబంధించిన డిజైన్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నెల రోజుల్లో డిజైన్లు ఖరారయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. కొత్త రైలును 2027 మొదటి ఆరు నెలల్లో, ముఖ్యంగా జూన్ నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న వందే భారత్ స్లీపర్ రైళ్లతో పోలిస్తే, కొత్త 24 కోచ్‌ల వేరియంట్‌లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఇందులో ప్రత్యేకంగా ప్యాంట్రీ కార్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రైలులోనే ఆహారాన్ని వేడి చేసి ప్రయాణికులకు అందించే అవకాశం ఉంటుంది. అలాగే టాయిలెట్ల సంఖ్యను పెంచడంతో పాటు ఇంటీరియర్స్ ను మరింత మెరుగుపరచాలని ICF భావిస్తోంది.
ప్రస్తుతం అభివృద్ధి చేసిన 16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. టెస్టింగ్ టైమ్ లో గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అయితే, అన్ని రైల్వే మార్గాల్లో ఈ స్థాయి వేగంతో ప్రయాణించడం సాధ్యం కాకపోవచ్చు.
ఈ రైళ్లలో మెత్తని కుషన్లతో కూడిన బెర్త్‌లు, ప్రత్యేక నైట్ లైటింగ్, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు అందించనున్నారు. పై బెర్త్ లపైకి సులభంగా వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అత్యాధునిక బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లో వేడి నీటి షవర్ కూడా అందుబాటులో ఉంటాయి.
రైలు భద్రత కోసం స్వదేశీ కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ ద్వారా విద్యుత్ వినియోగాన్ని మెరుగుపరచనున్నారు. ఆటోమేటిక్ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర సమయంలో డ్రైవర్‌తో మాట్లాడే కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉంటాయి. మొత్తంగా, 24 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే సుదూర రాత్రి ప్రయాణాల్లో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా వెళ్లే అవకాశం ఉంటుంది.
Read Also: వందే భారత్ సరికొత్త రికార్డు.. 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ సక్సెస్!