Travel Gadgets: ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న నేటి యుగంలో విదేశీ ప్రయాణాలు చాలా సాధారమైపోయాయి. కానీ, కొత్త దేశంలో ల్యాండ్ అవ్వగానే ఇంటర్నెట్ ఉండకపోవటం లేదా ఫోన్ బ్యాటరీ అయిపోవడం లాంటి చిన్న చిన్న సమస్యలు ప్రయాణ మజాను పాడుచేస్తుంటాయి. అందుకే మీరు బిజినెస్ పని మీద వెళ్తున్నా లేదా సరదాగా తిరగడానికి వెళ్తున్నా.. కొన్ని పరికరాలు మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఉంటే ప్రయాణం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ క్రమంలో విదేశాల్లో మీకు అడుగడుగునా తోడుగా నిలిచే కొన్ని ముఖ్యమైన గాడ్జెట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విదేశాలకు వెళ్లినప్పుడు నెట్‌వర్క్ రోమింగ్ చార్జీలు బాదేస్తుంటాయి. వీటి భారం నుంచి తప్పించుకోవడానికి గ్లోబల్ డేటా సపోర్ట్ చేసే పోర్టబుల్ వైఫై హాట్‌స్పాట్ లేదా ఈ-సిమ్ డివైస్ వాడటం బెస్ట్ ఆప్షన్. దీని ద్వారా ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ వంటి పరికరాలన్నింటికీ ఒకేసారి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు.
సుదీర్ఘమైన విమాన ప్రయాణాలు, ఎయిర్‌పోర్ట్‌లలో లేఓవర్ల సమయంలో ఫోన్ వాడి వాడి ఛార్జింగ్ త్వరగా అయిపోతుంటుంది. అందుకే కనీసం 20,000mAh సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న పవర్ బ్యాంక్ వెంట ఉంచుకోవడం మంచిది. అయితే ఫ్లైట్ ప్రయాణాలకు ఎయిర్‌లైన్స్ అనుమతించే మోడల్‌ను ఎంచుకుంటే సెక్యూరిటీ చెకింగ్ దగ్గర ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Also Read: గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?
ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సాకెట్ పిన్ మోడల్ ఉంటుంది. దేనికది వేర్వేరు ఛార్జర్లు మోసుకెళ్లే బదులు ఒక మంచి యూనివర్సల్ అడాప్టర్ తీసుకెళ్తే సరిపోతుంది. ఆ ఒక్క అడాప్టర్‌తోనే మల్టిపుల్ యూఎస్‌బీ పిన్ల ద్వారా మీ డివైజ్‌లు అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు.
ట్రిప్‌లో ఉన్నప్పుడు లగేజ్ బ్యాగ్ లేదా పాస్‌పోర్ట్ మిస్ అయితే ఆ కంగారు మాటల్లో చెప్పలేం. అందుకే మీ లగేజీ బ్యాగ్‌లో బ్లూటూత్ ఐటమ్ ట్రాకర్ ఉంచితే.. మీ ఫోన్ యాప్ సహాయంతో అది ఎక్కడుందో క్షణాల్లో కనిపెట్టవచ్చు.
సిగ్నల్స్ అస్సలు లేని అడవులు, కొండలు లేదా సముద్ర ప్రయాణాలు చేసే అడ్వెంచర్ లవర్స్‌కు శాటిలైట్ కమ్యూనికేటర్ చాలా అవసరం. అత్యవసర సమయంలో ఎస్ఓఎస్ సిగ్నల్స్ పంపడానికి, మీ లొకేషన్‌ను కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి ఇది ప్రాణరక్షకగా పనిచేస్తుంది.
గాడ్జెట్లతో పాటు ప్రయాణానికి ముందే ఆఫ్‌లైన్ మ్యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడం, పాస్‌పోర్ట్ డిజిటల్ కాపీలు ఫోన్‌లో దాచుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ప్రధాన ఖాతాలకు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సరైన పరికరాలు, చిన్న జాగ్రత్తలు మీ విదేశీ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సంతోషకరంగా మారుస్తాయి.
Also Read: Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?