Amarnath Yatra 2026: శివభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ పరమశివుడి దర్శన ఘడియలు ఆసన్నమయ్యాయి. భోలాశంకరుడి పవిత్ర అమర్‌నాథ్ యాత్ర నేటి నుండి అధికారికంగా ప్రారంభమైంది. హిమగిరుల్లోని 3వేల 880 మీటర్ల ఎత్తైన పవిత్ర గుహలో కొలువైన ఆ మంచు లింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
మహా యాత్ర ప్రారంభం
హిమగిరులు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. అమర్‌నాథ్‌లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే పవిత్ర హిమలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తుల తొలి బ్యాచ్ జమ్మూ బేస్ క్యాంప్ నుండి బయలుదేరింది. ఇవాళ ప్రారంభమైన ఈ మహా యాత్ర.. ఆగస్టు 28 వరకు సాగనుంది. మొత్తం 57 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్ర కొనసాగనుంది. అమర్‌నాథ్ గుహను చేరుకోవడానికి భక్తుల కోసం ప్రభుత్వం రెండు మార్గాల్లో అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో ఒకటి పహల్గామ్ రూట్. ప్రకృతి రమణీయత మధ్య సాగే ఈ మార్గం దాదాపు 32 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కాస్త ఎక్కువ సమయం పట్టినా భక్తులు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. ఇక రెండోది బల్తాల్ మార్గం. కేవలం 14 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో ప్రయాణం కాస్త కష్టమే. నిటారుగా ఉండే పర్వతాలను ఎక్కడ సవాలుతో కూడుకున్న పనే.
Also Read: తెలంగాణను అప్పుల పాలు చేసింది ఎవరు? కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ మైండ్ గేమ్!
అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడూ ఉగ్రవాదుల టార్గెటే
అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడూ ఉగ్రవాదుల టార్గెటే. ప్రస్తుతం పీఓకేలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాన్నుంచి దృష్టి మరల్చేందుకు పాకిస్థాన్.. అమర్‌నాథ్ యాత్రలో అలజడి సృష్టించే ఛాన్సుంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ భద్రతపై దృష్టి సారించింది. జమ్మూ-కశ్మీర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌తో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. SDRF, ఫైర్ సర్వీసెస్, ఆరోగ్య సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులో ఉంచింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 12 వరకు భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రకటించింది.