Sumeru Mountain Thailand: సోషల్ మీడియాలో ఎప్పుడైనా థాయిలాండ్ కు సంబంధించిన అందమైన ఏరియల్ ఫొటోలు చూస్తే, నీటి మధ్యలో ఒక భారీ ఆకారంతో కనిపించే ఈ నిర్మాణం మీ దృష్టిని ఆకర్షించే ఉంటుంది. చుట్టూ చెరువు, మధ్యలో మంటపం, దానికి చేరుకునే వంతెన.. మొత్తం దృశ్యం చూస్తే ఇది నిజమైన ప్రదేశమా? లేక ఏదైనా సినిమాలో చూపించిన సెట్టింగా? అనిపిస్తుంది. కానీ, ఇది నిజంగానే థాయిలాండ్‌లో ఉన్న ఒక ప్రత్యేకమైన నిర్మాణం. దీనినే సుమేరు పర్వత మంటపం అని పిలుస్తారు.
సుమేరు పర్వత మంటపం థాయిలాండ్‌లోని సముత్ ప్రకాన్ ప్రావిన్స్ లో ఉన్న ఏన్షియంట్ సిటీ లో ఉంది. ఇది సాధారణ మ్యూజియం కాదు. థాయిలాండ్ లోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, రాజప్రాసాదాలు, పురాణాలకు సంబంధించిన నిర్మాణాలను ఒకే ప్రదేశంలో చూడగలిగే భారీ ఓపెన్ ఎయిర్ మ్యూజియం. థాయిలాండ్ మ్యాప్ ఆకారంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధ నిర్మాణాలను ప్రతిరూపాలుగా ఏర్పాటు చేశారు.
హిందూ, బౌద్ధ విశ్వాసాల్లో మహా మేరు లేదంటే సుమేరు పర్వతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రాచీన విశ్వశాస్త్రం ప్రకారం ఇది విశ్వానికి కేంద్రంగా భావిస్తారు. పురాణ విశ్వాసాల ప్రకారం సుమేరు పర్వతం చుట్టూ వివిధ లోకాలు, సముద్రాలు ఉన్నట్లు చెబుతారు. పర్వత శిఖరంపై దేవతల నివాసం ఉంటుందని, అక్కడ ఇంద్రుడు థాయ్ సంప్రదాయంలో సక్కా పాలన సాగిస్తాడని నమ్మకం.
ఈ నిర్మాణాన్ని చూసినప్పుడు అందరి దృష్టిని ఆకర్షించే మరో అంశం నీటిలో కనిపించే భారీ చేప ఆకారం. దీనిని అనోంధా అని పిలుస్తారు. పురాణాల ప్రకారం, విశ్వ సముద్రంలో సుమేరు పర్వతం స్థిరంగా ఉండేందుకు అనోంధా చేప తన శరీరంతో దాన్ని చుట్టుకుని రక్షణగా నిలుస్తుంది. అందుకే, మంటపం చుట్టూ కనిపించే ఈ భారీ ఆకృతిని కేవలం అలంకరణగా చూడలేం. దాని వెనుక ఓ పౌరాణిక భావన ఉంది.
సుమేరు మంటపం ఫొటోల్లో మరింత అందంగా కనిపించడానికి ప్రధాన కారణం దాని చుట్టూ ఉన్న నీళ్లు. సరస్సు మధ్యలో నిర్మాణం ఉండటంతో దూరం నుంచి చూస్తే అది నీటిపై తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒడ్డునుంచి మంటపం వైపు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వంతెన కూడా ఈ ప్రదేశానికి ప్రత్యేక ఆకర్షణ. దానిపై నడుస్తూ వెళ్లడం వల్ల నిర్మాణం దగ్గరవుతున్న కొద్దీ దాని రూపం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. డ్రోన్, ఏరియల్ వ్యూ నుంచి చూస్తే సుమేరు మంటపం అసలు అందం కనిపిస్తుంది. చుట్టూ నీరు, మధ్యలో ఉన్న నిర్మాణం, దాన్ని చుట్టుకున్న అనోంధా ఆకారం కలిసి ఒక ప్రత్యేకమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. అందుకే సోషల్ మీడియాలో ఈ ప్రదేశానికి సంబంధించిన ఏరియల్ ఫొటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి.
ఈ ఏన్షియంట్ సిటీని నిర్మించడంలో కళాభిమాని, వ్యాపారవేత్త లేక్ విరియాఫంట్ కీలక పాత్ర పోషించారు. థాయిలాండ్ చరిత్ర, సంస్కృతి, పురాణాలను ఒకే ప్రదేశంలో చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ను రూపొందించారు. థాయ్ సంస్కృతి, పురాణ విశ్వాసాలు, నిర్మాణ కళను ఒకేసారి పరిచయం చేసే ప్రత్యేకమైన ప్రదేశం ఇది. బ్యాంకాక్ కు వెళ్తే, మీరూ తప్పకుండా ఈ ప్రదేశాన్నిచూసి రండి!
Read Also: ప్యారిస్ వెళ్లాల్సిన పనిలేదు.. హైదరాబాద్‌లోనే ఐఫిల్ టవర్‌పై కూర్చొని ఐస్‌క్రీమ్ తినొచ్చు!