Uber Train Ticket Booking: రైలు ప్రయాణికులకు ఉబెర్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఉబెర్ యాప్ నుంచే రైలు టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకోసం ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగోతో ఉబెర్ చేతులు కలిపింది. టికెట్ బుకింగ్‌తో పాటు PNR స్టేటస్ తెలుసుకోవడం, రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు, అక్కడి నుంచి గమ్యస్థానానికి చేరేందుకు ఉబెర్ రైడ్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
సాధారణంగా రైలు ప్రయాణానికి టికెట్ బుకింగ్ ఒక యాప్ లో, స్టేషన్‌కు వెళ్లేందుకు క్యాబ్ మరో యాప్‌లో చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఉబెర్ కొత్త సేవను తీసుకొచ్చింది. ప్రయాణికులు తమ ఇంటి నుంచి రైల్వే స్టేషన్ వరకు, అక్కడి నుంచి రైలులో ప్రయాణం, గమ్యస్థాన స్టేషన్ నుంచి చివరి డెస్టినేషన్ వరకు ప్రయాణాన్ని ఒకే యాప్ ద్వారా ప్లాన్ చేసుకోవచ్చు.
ఉబెర్ యాప్‌లో రైలు టికెట్ బుక్ చేయడం చాలా ఈజీ. ముందుగా యాప్ ను ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్, సర్వీసెస్ విభాగంలో కనిపించే ‘బస్ & ట్రైన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఆ తర్వాత ‘ట్రైన్ టికెట్స్’పై క్లిక్ చేయాలి. ప్రయాణం మొదలు పెట్టే స్టేషన్, దిగే స్టేషన్, ప్రయాణ తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
అందుబాటులో ఉన్న రైళ్ల లిస్టు కనిపించిన తర్వాత మీకు అనుకూలమైన రైలును ఎంచుకుని టికెట్ బుకింగ్ చేసుకోవాలి. టికెట్ బుక్ అయిన తర్వాత దాని వివరాలను యాప్‌లోనే చూడవచ్చు.
టికెట్ బుకింగ్ తో సర్వీసు అయిపోదు. ప్రయాణికులు తమ PNR స్టేటస్ ను కూడా నేరుగా ఉబెర్ యాప్ లో చెక్ చేసుకోవచ్చు. దీంతో రైలు టికెట్ కోసం మరో ప్లాట్ ఫామ్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అదే విధంగా రైల్వే స్టేషన్ కు వెళ్లడానికి, తిరిగి ఇంటికి రావడానికి ఉబెర్ రైడ్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు.
రైలు టికెట్ బుకింగ్ చేరడంతో ఉబెర్ మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ సేవలు మరింత పెరిగాయి. ప్రస్తుతం మోటో, ఆటో, కార్లు, మెట్రో, ఇంటర్ సిటీ కార్లు, ఇంటర్‌సిటీ బస్సులు లాంటి సేవలతో పాటు రైలు టికెట్ బుకింగ్ కూడా ఇందులో చేరింది. సిటీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాలను ఒకే ప్లాట్ ఫామ్‌తో అనుసంధానించాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్ తీసుకొచ్చినట్లు ఉబెర్ తెలిపింది.
ఇక్సిగోతో భాగస్వామ్యం ద్వారా రైలు టికెట్ బుకింగ్‌ను ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ రవాణాతో కలపడం ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేయాలని ఉబెర్ భావిస్తోంది. రైల్వే స్టేషన్లలో ప్రత్యేక పికప్, డ్రాప్ ఆఫ్ ప్రాంతాలను కూడా ఉబెర్ కలిగి ఉంది. దీంతో రైలు ఎక్కే ముందు, దిగిన తర్వాత ప్రయాణికులకు క్యాబ్ సదుపాయం సులభంగా లభించే అవకాశం ఉంది.
Read Also: ఒక్కొక్కటి కాదు.. ఒకేసారి 50 వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!