Indian Railways: ఇండియన్ రైల్వే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ 3.0 వెర్షన్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) అభివృద్ధి చేస్తున్న కొత్త ట్రైన్ సెట్లు, సౌకర్యంతో పాటు తక్కువ ధరలకే ప్రయాణాన్ని అందించబోతున్నాయి. ఇందులో AC, నాన్-AC కోచ్‌లను పరిచయం చేయబోతున్నారు. అమృత్ భారత్ 1.0, 2.0 వెర్షన్ ల నుంచి వచ్చి ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొత్త అమృత్ భారత్ 3.0 రైళ్లను తయారు చేస్తున్నట్లు ICF జనరల్ మేనేజర్ సుబ్బారావు తెలిపారు.
అమృత్ భారత్ 3.0 రైళ్ల ప్రత్యేకత ఏంటి?
ప్రస్తుతం ఉన్న నాన్-ఏసీ రైళ్ల మాదిరిగా కాకుండా, 3.0 వెర్షన్ లో ఏసీ, నాన్-ఏసీ కోచ్‌లు రెండూ ఉంటాయి. తక్కువ ధరకు టికెట్లను అదించడంతో పాటు విస్తృత శ్రేణి ప్రయాణీకులను ఆకర్షించడానికి ఇలా రూపొందిస్తున్నారు. ఈ మిశ్రమ కాన్ఫిగరేషన్ సరసమైన ధరకే అప్ గ్రేడ్ చేయబడిన సౌకర్యాన్ని కోరుకునే పేద, మధ్యతరగతి ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
గత వెర్షన్లతో అమృత్ భారత్ 3.0 ఎలా భిన్నంగా ఉంటుంది?
అమృత్ భారత్ 1.0 వెర్షన్ నాన్-ఏసీ రైలు ప్రయాణాన్ని అందించడంపై దృష్టి సారించగా, అమృత్ భారత్ 2.0 మాడ్యులర్ టాయిలెట్లు, అత్యవసర కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు, అప్ గ్రేడ్ చేయబడిన సీటింగ్, లైటింగ్ లాంటి కీలక హంగులను అద్దింది. అమృత్ భారత్ 3.0 ఈ అప్ గ్రేడ్ లపై ఆధారపడి ఎయిర్ కండిషన్డ్ కోచ్ లను పరిచయం చేస్తోంది.
ప్రస్తుతం ఎన్ని అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి?
ప్రస్తుతం దర్భాంగా-ఆనంద్ విహార్ టెర్మినల్, మాల్డా టౌన్-SMVT బెంగళూరు, ముంబై LTT-సహర్సా, రాజేంద్ర నగర్ టెర్మినల్-న్యూఢిల్లీ, దర్భాంగా-గోమతి నగర్, మాల్డా టౌన్-గోమతి నగర్, బాపుధాం మోతిహరి-ఆనంద్ విహార్ టెర్మినల్, సీతామర్హి-ఢిల్లీ లాంటి మార్గాల్లో ఎనిమిది అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. తక్కువ ఛార్జీలు, మెరుగైన సౌకర్యాల కోసం ఈ రైళ్లను బడ్జెట్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ప్రయాణీకుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది.
Read Also: అది లోకల్ ట్రైన్ కాదురా అయ్యా, నమో భారత్!
అమృత్ భారత్ 3.0 ఎందుకు ప్రత్యేకం?
దేశంలో ముఖ్యంగా తక్కువ, మధ్య ఆదాయ వర్గాలలో సరసమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణానికి డిమాండ్ పెరుగుతున్నది. అమృత్ భారత్ 3.0 కీలకమైన ఈ అంతరాన్ని రూపుమాపే అవకాశం ఉంది. ఇది వందే భారత్ తరహా ప్రయాణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదీ తక్కువ ధరలోనే. ఈ రైలు ప్రయాణం పేద, మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉండనుంది. త్వరలోనే ఈ లేటెస్ట్ రైలు అందుబాటులోకి రానుంది.
Read Also: ఇండియన్ రైల్వే రౌండ్ ట్రిప్ స్కీమ్, డిస్కౌంట్ కోసం ఇలా ట్రై చేయండి!