Summer Destinations: సమ్మర్ వచ్చేసింది. భానుడి ప్రతాపం మెల్లగా పెరుగుతోంది. మార్చి వచ్చిందంటే ఆ సూర్యుడి వేడి మరింతగా మంటపుట్టిస్తుంది. దీంతో.. దక్షిణాదిలో సమ్మర్ టూరిస్ట్ స్పాట్లు ఏమేం ఉన్నాయి అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేసవి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఊటీ. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
తమిళనాడులో ఉన్న ఊటీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. ప్రసిద్ధి హిల్‌స్టేషన్‌గా ఊటీని అంతా గుర్తు చేసుకుంటారు. అయితే.. ఊటీ టూర్‌లో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటిని ఓసారి పరిశీలిస్తే.. మొట్ట మొదటిది ఊటీ సరస్సు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో టూరిస్టుల కోసం కృత్రిమంగా నిర్మించిన సరస్సు ఇది. బోటింగ్‌కు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ బోటింగ్ చేయడం ద్వారా గజిబిజి లైఫ్ నుంచి దూరంగా వెళ్లి టూరిస్టులు ఇక్కడ ఓ అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు. ఫిషింగ్‌కు కూడా ఈ ప్రాంతం పెట్టింది పేరు.
ఊటీ టూర్‌లో మరో టూరిస్ట్ అట్రాక్షన్ బొటానికల్ గార్డెన్. 55 ఎకరాల విస్తీర్ణంలో ఈ తోట వ్యాపించి ఉంది. ఫెర్న్ హౌస్, లోయర్ గార్డెన్, ఇటాలియన్ గార్డెన్, కన్జర్వేటరీ, నర్సరీలు అంటూ ఐదు వేర్వేరు భాగాలుగా దీనిని విభజించారు. ఊటీ వేసవి ఉత్సవంలో భాగంగా ఇక్కడ నిర్వహించే పూల ప్రదర్శన సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. బొటానికల్ గార్డెన్ మరో ఆకర్షణ శిలాజ చెట్టు ట్రంక్. ఇది సుమారు 20 మిలియన్ సంవత్సరాల కిందటిగా చెబుతారు.
ఊటీ వచ్చే టూరిస్టులు ఎక్కడా ఎక్కడా అంటూ వెతికే అట్రాక్షన్ టాయ్ ట్రైన్. అవును..నీలగిరి మౌంటెన్ రైల్వేలో భాగమైన ఊటీ టాయ్ ట్రైన్ ఇక్కడున్న స్పెషల్ అట్రాక్షన్. మెట్టుపాళయం నుంచి ఊటీకి నడిచే ఈ ట్రైన్‌లో జీవితంలో ఒక్కసారి ప్రయాణించినా సరే.. లైఫ్ అంతే ఆ మెమొరీలను గుర్తు పెట్టుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ జర్నీ. పచ్చని అడవులు.. ఎత్తైన చెట్లు, లోతైన లోయల గుండా సాగే ఈ జర్నీ వర్ణించనలవి కాదంటే అతిశయోక్తి లేదు.
ఊటీ ట్రిప్‌లో మరో టూరిస్ట్ అట్రాక్షన్.. రోజ్ గార్డెన్. సాధారణంగానే గులాబీలను చూస్తే ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కన్పిస్తాయి. అలాంటిది ఏకంగా రంగు రంగుల గులాబీ తోటలను చూస్తే వావ్ అనకుండా ఉండలేరు మరి. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రోజ్ గార్డెన్‌లో 20 వేలకు పైగా గులాబీ రకాలు కొలువు తీరి కన్పిస్తాయి.
ఉదగమండలం ట్రిప్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ పైకారా జలపాతాలు. ఊటీ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాతాలు పిక్నిక్ స్పాట్‌గా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తున్నాయి. జలపాతం సమీపంలో బోట్ హౌస్ ఉంది. స్వచ్ఛమైన నీటి ప్రవాహాన్ని చూస్తూ బోట్‌లో విహరించడం సందర్శకులకు మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.
కేవలం ఇవే కాదు.. గవర్నమెంట్ మ్యూజియం, థ్రెడ్ గార్డెన్, హనీమూన్ బోట్ హౌస్, పైన్ చెట్ల అడవులు, అవలాంచె సరస్సు, ఎమరాల్డ్ లేక్, కల్హట్టి జలపాతాలు, టీ మ్యూజియం.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వేసవిలో ఎంతో చల్లగా అన్పించే ఈ ప్రకృతి రమణీయమైన పిక్నిక్ స్పాట్‌లో ఒక్కో అట్రాక్షన్ మీ మనసును దోచేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
తమిళనాట ఉన్న మరో హిల్ స్టేషన్ కొడైకెనాల్. ఊటీ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. ఇక్కడ కూడా మండు వేసవిలో అత్యంత చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం. సముద్ర మట్టానికి 7200 అడుగుల ఎత్తులో చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, విశాలమైన లోయలు, పారుతున్న జలపాతాల మధ్య ఎంతో సుందరంగా కన్పిస్తుంది కొడైకెనాల్.
కొడైకెనాల్‌లో అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం పిల్లర్ రాక్స్. ఇక్కడి రాక్ పిల్లర్స్ 400 అడుగుల ఎత్తులో కనువిందు చేస్తాయి. పర్యాటకుల మదిని దోచుకుంటాయి. వీటిపై నుంచి చూస్తే మొత్తం కొడైకెనాల్ అందాలు మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి.
Also Read: Mystery web Series : చిన్న వయసులోనే మిస్సింగ్…12 ఏళ్ల తర్వాత ఇంటికి… ఫ్యూజులు అవుట్ అయ్యే సస్పెన్స్
కొడై కెనాల్ టూర్‌లో మరో బ్యూటిఫుల్ ప్లేస్ కొడై సరస్సు. ఇది కొడైకెనాల్ పట్టణానికి అత్యంత దగ్గరగా ఉంటుంది. 1863లో ఈ సరస్సును నిర్మించారు. సుమారు 60 ఎకరాల్లో విస్తరించిన కొడై సరస్సులో బోటు షికారు స్పెషల్ అట్రాక్షన్. దీంతోపాటు.. పంపార్ జలపాతం కూడా మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. చూడడానికి సన్నని ప్రవాహంలా కన్పించినా మనసుకు ఎంతో ప్రశాంతత కల్పిస్తుంది పంపార్ జలపాతం.
Also Read: worst Country: ఈ దేశంలో టీవీ చూసే స్వేచ్ఛ కూడా లేదు, టీవీ రిమోట్ ప్రభుత్వ నిఘాలోనే