IRCTC Ayodhya-Kashi Tour: తెలుగు భక్తులకు ఐఆర్‌సీటీసీ మరో అదిరిపోయే ప్యాకేజీని పరిచయం చేసింది. అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. కాశీ పుణ్య క్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది.
నిజానికి రామ మందిరం నిర్మాణం తర్వాత అయోధ్యకు వెళ్లాలనకునే భక్తుల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో ఒక్కసారైనా కాశీ దర్శించాలనుకునే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గత కొంత కాలంగా సౌత్ నుంచి ఈ రెండు పుణ్యక్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఇలాంటి వారి కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. భారతీయ రైల్వే టూరిజం విభాగం అయిన ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీలను పరిచయం చేసింది.
సెప్టెంబర్ 9న భారత్ గౌరవ్ రైల్లో యాత్ర ప్రారంభం
అయోధ్య-కాశీ పుణ్యక్షేత్రాలకు సంబందించిన యాత్ర సెప్టెంబర్ 9న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 10 రోజుల పాటు ఈ టూర్ కొనసాగనుంది. భారత్ గౌరవ్ పర్యటక రైలులో ఈ యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రైలులో స్లీపర్ క్లాస్, 3 ఏసీ, 2 ఏసీ బోగీలు ఉంటాయి. మొత్తం 639 సీట్లు ఈ రైలులో అందుబాటులో ఉంటాయి. 10 రోజుల యాత్రలో పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవుని ఆలయం, డియోఘర్‌లోని బాబా బైద్యనాథ్ ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయాలు, గంగా హారతి సందర్శనతో పాటు అయోధ్య(Ayodhya)లోని రామ జన్మభూమి, హనుమాన్‌గరి, ప్రయాగరాజ్‌లో త్రివేణి సంగమం వంటి పుణ్యక్షేత్రాలను కవర్‌చే స్తారని వెల్లడించారు.
భారత్ గౌరవ్ రైలు ఆగే రైల్వే స్టేషన్లు ఇవే!
ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఆ తర్వాత కాజీపేట, వరంగల్ స్టేషన్లు, ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది. రెండో రోజు రైలు పూరీకి చేరుకుంటుంది. పూరీ జగన్నాథుడి దర్శనం తర్వాత 3వ రోజు కోణార్క్ సూర్య దేవాలయాన్ని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. 4వ రోజు బాబా వైధ్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం కల్పిస్తారు. 5వ రోజు వారణాసికి తీసుకెళ్తారు. 6వ రోజు కాశీ విశ్వనాథ్ ఆలయం, విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణ దేవి ఆలయాల దర్శనాలు ఉంటాయి. రాత్రికి గంగా హారతిని చూడవచ్చు. ఆ తర్వాత అయోధ్యకు బయలుదేరి వెళ్లాలి. ఏడో రోజు శ్రీ రామ జన్మభూమి, ఆంజనేయ స్వామి ఆలయం వంటి పుణ్య క్షేత్రాలు, పర్యటక ప్రదేశాలు చూపిస్తారు. అక్కడి నుంచి ప్రయాగ్ రాజ్ చేరుకుంటారు. ఎనిమిదో రోజున గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయాల్సి ఉంటుంది. వీటన్నింటి తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 18వ తేదీన తిరిగి సికింద్రాబాద్‌కి చేరుకుంటారు.
ప్యాకేజీ వివరాలు
కాశీ-అయోధ్య యాత్ర ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ధర రూ.17,000, 3ఏసీ రూ.26,700, 2 ఏసీ టికెట్ ధర రూ.35,000గా నిర్ణయించినట్ల ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు కల్పించనున్నారు. పూర్తి ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్ సైట్ ను సంప్రదించవచ్చన్నారు.
Read Also: వైజాగ్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఆ రూట్ లో రైలు సర్వీసులు బంద్!