Jammu Srinagar Vande Bharat: జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణించే వారికి భారతీయ రైల్వే మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఈ మార్గంలో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెట్టేందుకు రైల్వే సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉధంపూర్ ప్రజలకు ఈ కొత్త రైలు సర్వీసు మరింత ఉపయోగపడనుంది.
జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రతిపాదించిన మూడో వందే భారత్ రైలుకు ఉధంపూర్ లో స్టాప్ ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. స్థానిక ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఉధంపూర్ ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రయాణించాలంటే అందుబాటులో ఉన్న రైళ్ల సమయాలను బట్టి ప్రయాణికులు తమ రాకపోకలను కొనసాగించాల్సి వచ్చేది. కొత్త సర్వీస్ అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభతరం కానుంది.
జమ్మూ-శ్రీనగర్ రైలు కనెక్టివిటీలో వందే భారత్ కీలక మార్పు తీసుకొచ్చింది. 2025 జూన్ 6న రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మొదట ఈ రైళ్లు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు నడిచేవి. తర్వాత 2026 ఏప్రిల్ 30 నుంచి ఈ సేవలను జమ్మూ తవాయి రైల్వే స్టేషన్ వరకు పొడిగించారు. దీంతో జమ్మూ తవాయి నుంచి శ్రీనగర్‌కు నేరుగా వందే భారత్ ప్రయాణించే అవకాశం ప్రయాణికులకు వచ్చింది.
ఈ రెండు రైళ్లు ప్రారంభమైనప్పటి నుంచి మంచి స్పందన లభిస్తోంది. రైళ్లు పూర్తి సామర్థ్యంతో నడుస్తుండటంతో ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచారు. మొదట ఒక్కో రైలులో 16 కోచ్‌లు ఉండగా.. ఆ సంఖ్యను 20కి పెంచారు. అయినప్పటికీ ఈ మార్గంలో మరింత డిమాండ్ ఏర్పడ్డంతో మూడో వందే భారత్‌ను తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జమ్మూ తవాయి-శ్రీనగర్ వందే భారత్ రైలు మొత్తం 269 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 4 గంటల 45 నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఈ మార్గంలో ఉధంపూర్, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, రియాసి, బనిహాల్ లాంటి కీలకమైన స్టేషన్లలో స్టాప్‌లు ఉన్నాయి. ఈ రైలు వల్ల జమ్మూ నుంచి కశ్మీర్ లోయకు వెళ్లే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తోంది. ముఖ్యంగా పర్యాటకులు, ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడనుంది.
Read Also: IRCTC మొదలైంది అప్పుడే.. ఆ రోజు ఎన్ని టికెట్లు ఆన్‌లైన్లో బుక్ అయ్యాయో తెలుసా?