IRCTC First Day Online Booking: ఈ రోజుల్లో మొబైల్ చేతిలో ఉంటే కొన్ని నిమిషాల్లో రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ, ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. రైలు టికెట్ కావాలంటే రైల్వే స్టేషన్ కు వెళ్లి కౌంటర్ ముందు గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. సెలవులు, పండుగల వేళ క్యూలు మరింత పొడవుగా ఉండేవి. టికెట్ దొరుకుతుందో? లేదో? తెలియక చాలామంది ఉదయం నుంచే స్టేషన్‌కు వెళ్లేవారు. అలాంటి రోజుల్లో భారతీయ రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. IRCTC ఆన్‌లైన్ టికెటింగ్ ను పరిచయం చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు ఉపయోగిస్తున్న ఈ సర్వీసు మొదట్లో చాలా చిన్న స్థాయిలో ప్రారంభమైంది.
భారతీయ రైల్వేలో డిజిటల్ టికెటింగ్‌కు శ్రీకారం చుడుతూ IRCTC 2002 ఆగస్టు 3న ఆన్‌లైన్ ఇ-టికెటింగ్ సేవలను ప్రారంభించింది. అయితే, తొలి రోజే వేల సంఖ్యలో టికెట్లు బుక్ అయ్యాయని అనుకుంటే పొరపాటే. ఆ రోజు IRCTC వెబ్ సైట్ ద్వారా బుక్ అయిన టికెట్ల సంఖ్య జస్ట్ 29. దానికి కారణం, అప్పట్లో ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్ పేమెంట్లు కూడా పెద్దగా అందుబాటులో లేవు. క్రెడిట్ కార్డులు, డిజిటల్ చెల్లింపులు సాధారణ ప్రజలకు అంతగా అందుబాటులో లేవు. అందుకే IRCTC ప్రయాణం నెమ్మదిగా మొదలైంది.
సాంకేతికత అభివృద్ధి చెందడంతో పాటు ఇంటర్నెట్ వినియోగం కూడా దేశంలో వేగంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం, డిజిటల్ పేమెంట్లు పెరగడంతో IRCTC వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు ప్రతి రోజు లక్షల సంఖ్యలో రైలు టికెట్లు IRCTC ద్వారా బుక్ అవుతున్నాయి. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో వెబ్ సైట్, యాప్ పై భారీ ట్రాఫిక్ ఉంటుంది. కొన్ని నిమిషాల్లోనే వేలాది మంది టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండానే ఇంటి నుంచే టికెట్ బుక్ చేసుకోవడం సాధ్యం అవుతోంది. సీట్లు చూసుకోవడం, రద్దు చేసుకోవడం, చార్ట్ వివరాలు తెలుసుకోవడం లాంటి అన్ని పనులు కూడా ఆన్ లైన్ లోనే చేయవచ్చు.
చాలామంది IRCTCని కేవలం రైలు టికెట్లు బుక్ చేసే వెబ్‌సైట్‌గా మాత్రమే భావిస్తారు. కానీ, ఈ సంస్థ సర్వీసులు దానికంటే చాలా విస్తృతంగా ఉన్నాయి. రైళ్లలో ఫుడ్ సర్వీసులు, స్టేషన్లలో ఫుడ్ ప్లాజాలు, ఇ కేటరింగ్ లాంటి సేవలను IRCTC అందిస్తోంది. ప్రయాణికులు తమ సీటు దగ్గరికే ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా దేశీయ, విదేశీ టూర్ ప్యాకేజీలు, విమాన టికెట్లు, బస్సు టికెట్లు లాంటి సర్వీసులు కూడా అందిస్తోంది. రైళ్లలో, స్టేషన్లలో అందుబాటులో ఉండే ‘రైల్ నీర్’ తాగునీటి ఉత్పత్తిలో కూడా IRCTC పాత్ర ఉంది. చిన్నగా మొదలైన ఒక ఆలోచన నెమ్మదిగా కోట్లాది మంది ప్రయాణికుల రోజువారీ జీవితంలో భాగమైందంటే, IRCTC ప్రస్థానం నిజంగానే ఆసక్తికర డిజిటల్ విప్లవం.
Read Also: ఇక ఉబెర్ యాప్‌లో ట్రైన్ టికెట్ల బుకింగ్.. PNR స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు!