Bihar Train Crime: కదులుతున్న రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు ఒడిగడుతున్న సైకో కిల్లర్ ను బీహార్‌లోని బక్సర్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయక ప్రయాణికులను కిడ్నాప్ చేయడం, వారి కుటుంబ సభ్యులను బెదిరించి దందాలు సాగించడం, ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కదులుతున్న రైలులోంచి కిందకు తోసేయడం ఇతని నైజం. వైశాలి జిల్లాకు చెందిన 21 ఏళ్ల నితిన్ కుమార్ హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి.
వైశాలికి చెందిన నితిన్ కుమార్ హైదరాబాద్‌లో పనిచేస్తూ సెప్టెంబర్ 19న ‘దానాపూర్ స్పెషల్’ రైలులో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో నితిన్‌ను టార్గెట్ చేసిన సైకో కిల్లర్ రోహిత్.. అతని వద్దకు చేరి ఉచ్చు బిగించాడు. ఆ తర్వాత నితిన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 10,000 కప్పం కట్టాలని బెదిరించాడు. భయపడిపోయిన కుటుంబ సభ్యులు ఆ డబ్బులు పంపినప్పటికీ.. దయలేకుండా నితిన్ కాళ్లు, చేతులు కట్టేసి కదులుతున్న రైలులోంచి బయటకు తోసేశాడు. ఈ దారుణంలో నితిన్ ప్రాణాలు కోల్పోయాడు.
రైలు ప్రయాణంలో కుమారుడు కనిపించకుండా పోవడం, అంతకుముందే బెదిరింపు ఫోన్ రావడంపై నితిన్ కుటుంబ సభ్యులు బక్సర్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను బట్టి రైల్వే డీఎస్పీ కాంచన్ కుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వారణాసిలో తలదాచుకున్న రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నితిన్ కాళ్లు చేతులు కట్టేసి రైలులోంచి తోసేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
రైల్వే డీఎస్పీ కాంచన్ కుమారి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రోహిత్ ప్రయాణికులను నమ్మించడానికి రకరకాల వేషాలు వేసేవాడు. ఒకసారి పోలీసు అధికారిగా, మరోసారి జీఆర్పీ (GRP) లేదా ఎస్టీఎఫ్ (STF) సిబ్బందిగా పరిచయం చేసుకునేవాడు. నితిన్ విషయంలో కూడా సిగరెట్ తాగుతున్నావనే నెపంతో బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
Also Read: యువతి టీ-షర్ట్‌పై ‘Urban Mindset’ నోట్.. అర్ధరాత్రి రెచ్చిపోయిన పోకిరీలు.. కారులోకి లాగేందుకు యత్నం!
రోహిత్ ఇలాంటి నేరాలకు పాల్పడటం ఇదే తొలిసారి కాదని పోలీసులు తెలిపారు. 2024లో కూడా బక్సర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఇలాగే కదులుతున్న రైలులోంచి కిందకు తోసేశాడు. అయితే ఆ ఘటనలో ఆ ఇద్దరూ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన రోహిత్.. మళ్లీ పాత పద్ధతిలోనే దారుణాలకు తెగబడ్డాడు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా స్పీడీ ట్రయల్ కు కేసును సిద్ధం చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
Also Read: ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!