Delhi Harassment Case: దేశ రాజధాని ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. హిందూ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థినుల పట్ల ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యంత నీచంగా ప్రవర్తించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం నాటికి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఘటన జరిగిన రోజు రాత్రి దాదాపు 9:30 గంటల సమయంలో విద్యార్థినులు విజయనగర్ హకీకత్ పార్క్ సందర్శించి తిరిగి వస్తుండగా ఒక తెల్లటి టాటా సఫారీ కారు వారి వద్దకు వచ్చి ఆగింది. అందులో ఉన్న నమన్ అనే విద్యార్థి.. ఓ మహిళా స్టూడెంట్ వేసుకున్న టీషర్ట్ పై కామెంట్ చేశారు. ఆమె డ్రెస్ పై ‘అర్బన్ మైండ్ సెట్’ అని ఉండగా.. ‘టీ-షర్ట్ బాగుంది’ అని నమన్ కామెంట్ చేశాడు. దీనిని సదరు విద్యార్థినులు తీవ్రంగా తప్పుపట్టడంతో కారులోని యువకులు వారిపై బూతులతో విరుచుకుపడ్డారు.
బాధితులు అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నప్పటికీ నిందితులు తమ కారులో వారిని అనుసరిస్తూ వేధించడం కొనసాగించారు. ఈ క్రమంలో ధైర్యం చేసిన విద్యార్థినులు నిందితుల కారును, వారి ప్రవర్తనను తమ ఫోన్లలో రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన నిందితులు కారును ఆపి, ఆ విద్యార్థినులను బలవంతంగా వాహనంలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించి మరో స్నేహితురాలు వెంటనే నిందితుల ముఖాలను రికార్డ్ చేయడం ప్రారంభించింది. దీంతో భయపడిన ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి కారులో వేగంగా పారిపోయారు.
ఈ భయానక అనుభవం తర్వాత బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. సంఘటన జరిగిన వెంటనే న్యాయం కోసం మోరిస్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. అది తమ పరిధిలోకి రాదని చెప్పి పంపించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రి సమయంలో దాదాపు 4-5 గంటల పాటు బాధితులు, వారి స్నేహితులు సుమారు 3 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కూడా ముందూ వెనకా ఆలోచించారని ఆరోపించింది. అర్ధరాత్రి వేళ అంతసేపు రోడ్డుపై నిలబడినా అధికారులు పట్టించుకోలేదని వాపోయింది.
Also Read: ఏంటీ ఈ బుల్లి పాకెట్ వెనుక.. 150 ఏళ్ల చరిత్ర ఉందా? పైగా కాయిన్స్ కోసం కాదా!
సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడం, విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమవ్వడంతో చివరికి ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల విచారణలో నిందితులు అభినవ్, అభిమన్యు, నమన్ అని తేలింది. వీరిలో అభినవ్, అభిమన్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన ముగ్గురు నిందితులు.. ఘటన సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు ఒప్పుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు బాధితుల ఫిర్యాదుపై సకాలంలో స్పందించకుండా తిప్పించుకున్న పోలీసు అధికారుల అలసత్వంపై కూడా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Also Read: ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!