Charlapalli special trains: ఎప్పుడు వెళ్లినా ట్రైన్ నంబర్ చూసుకుని నిరాశ చెందేవాళ్లకి ఇది నిజంగా మంచి వార్తే. ఇక నిలబడి ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ సారి రైల్వే శాఖ ముందుగానే ప్రయాణికుల మనసు దోచే నిర్ణయం తీసుకుంది. భక్తులు, పర్యాటకులు, ఆఫీసు జనం, సెలవుల్లో ఊరు వెళ్లే కుటుంబాలు.. ఎవరి కోసమైనా ఓ ప్రత్యేక ట్రైన్ ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. ఇటీవల ప్రయాణికుల డిమాండ్ పెరుగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రధానంగా చర్లపల్లి, హైదరాబాద్ నుంచే ఈ సారి ఎక్కువ స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. రామేశ్వరం, కొల్లం, యశ్వంత్‌పూర్, రుషీకేష్, సుబేదర్ గంజ్ వంటి గమ్యస్థానాలకు ఇక నేరుగా కనెక్షన్ లభించనుంది. దీని వల్ల చాలామంది ప్రయాణికులకు సీటు దొరకక, ప్లాట్‌ఫామ్ మీదే పడుకునే పరిస్థితి నుంచి ఉపశమనం కలగనుంది.
రామేశ్వరం స్పెషల్
జూలై 2 నుంచి 23 వరకు చర్లపల్లి–రామేశ్వరం మధ్య (07695) నంబర్‌తో నడిచే నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా రామేశ్వరం నుండి చర్లపల్లి దాకా తిరుగు ప్రయాణంగా జూలై 4 నుంచి 25 వరకు (07696) నంబర్‌తో మరో నాలుగు రైళ్లు నడవనున్నాయి. దీని వల్ల దక్షిణ భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలకి వెళ్లే భక్తులకు బాగా సౌలభ్యం కలగనుంది.
హైదరాబాద్ – కొల్లం రూట్లో వెసులుబాటు
ఇంకా జూలై 5 నుంచి 26 వరకు హైదరాబాద్ – కొల్లం మధ్య (07193) నంబర్‌తో నాలుగు రైళ్లు నడవనున్నాయి. తిరుగు ప్రయాణంగా జూలై 7 నుంచి 28 వరకు కొల్లం – హైదరాబాద్ మధ్య (07194) నంబర్‌తో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇది ముఖ్యంగా పర్యాటకులకు, కేరళ వైపు వెళ్లే విద్యార్థులకు ఉపశమనం కలిగించనుంది.
సుబేదర్ గంజ్ – చర్లపల్లి రైళ్లు
జూన్ 26 నుంచి జూలై 31 వరకు సుబేదర్ గంజ్ – చర్లపల్లి (04121) నంబర్‌తో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. తిరుగు రూట్ అయిన చర్లపల్లి – సుబేదర్ గంజ్ (04122) రైళ్లు జూన్ 28 నుంచి ఆగస్టు 2 వరకు లభ్యం కానున్నాయి.
యశ్వంత్‌పూర్ – యోగనగరి రుషీకేష్ మధ్య
ఉత్తరాఖండ్ బృహత్ పర్యాటక ప్రాంతం అయిన యోగనగరి రుషీకేష్ కు వెళ్లే వారికి గుడ్ న్యూస్! జూన్ 26 నుంచి జూలై 3 వరకు యశ్వంత్‌పూర్ – రుషీకేష్ (06597) రైలు నడవనుంది. తిరుగు ప్రయాణంగా జూన్ 28 నుంచి జూలై 5 వరకు రుషీకేష్ – యశ్వంత్‌పూర్ (06598) రైలు అందుబాటులో ఉంటుంది.
ప్రయాణికులకు రిలీఫ్
ఈ స్పెషల్ రైళ్ల వల్ల పండుగలు, సెలవులు, పెళ్లిళ్లు, పర్యటనలు ఏ సందర్భమైనా ఇక ట్రైన్ టికెట్ దొరక్క తల పట్టుకునే పరిస్థితి తగ్గనుంది. ముఖ్యంగా చర్లపల్లి నుండి నేరుగా ఇంత విస్తృతమైన ప్రయాణం చేసేందుకు ట్రైన్లు ఉండటం అభివృద్ధికి చిహ్నం. ఇవన్నీ ప్రయాణికుల డిమాండ్ మేరకే నిర్ణయించడం విశేషం. దీని వల్ల ప్రయాణ ప్రణాళికలు సులభతరం కానుండగా, టూరిజం, రీజినల్ కనెక్టివిటీకి బలంగా ఉపయోగపడే అవకాశం ఉంది.
దీంతో పాటు, రైళ్ల టైమింగ్స్, రిజర్వేషన్ తేదీలు, స్టాపేజ్ వివరాలు మొదలైనవి త్వరలో అధికారిక వెబ్‌సైట్ లేదా రైల్వే యాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు ముందుగానే తమ టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.