No Railway Networks Countries: ప్రపంచ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ రోజు రోజుకు మరింతగా అభివృద్ధి చెందుతోంది. ప్రజా రవాణాలో, సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, ఇప్పటికీ రైళ్లు అంటే ఏంటో తెలియని దేశాలు ఉన్నాయి. ఇంతకీ రైళ్లు లేని దేశాలు ఏవి? ఆ దేశాల్లో రైల్వే వ్యవస్థ ఎందుకు లేదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైల్వే నెట్ వర్క్ లేని దేశాలు ఇవే!
ఈ 7 దేశాల్లో ఇప్పటికీ రైల్వే నెట్ వర్క్ లేదు. ఆర్థిక వనరులు లేకపోవడం, భౌగోళిక స్థితులు అనుకూలించకపోవడం వల్ల ఇక్కడ రైల్వే వ్యవస్థ అందుబాటులోకి రాలేదు.
⦿ ఐస్లాండ్: ఈ దేశంలో రోడ్డు, సముద్ర, విమాన వ్యవస్థలు ఉన్నప్పటికీ, రైల్వే వ్యవస్థ లేదు. తక్కువ జనాభా, దేశంలో కఠినమైన వాతావరణ పరిస్థితుల వల్ల రైల్వే నెట్ వర్క్ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం మొగ్గు చూపలేదు. 1990లో రైల్వే నెట్ వర్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ. ఆ తర్వాత కార్యరూపం దాల్చలేదు.
⦿ అండోరా: జనాభాలో 11వ అతిచిన్న దేశంగా, భూభాగంలో 16వ స్థానంలో ఉన్న అండోరాలో రైల్వే నెట్ వర్క్ ఇప్పటికీ లేదు. అండోరా సరిహద్దుల్లోకి 1.2 మైళ్ల దూరంలో ఉన్న ఫ్రెంచ్ రైల్వే కనెక్షన్ తప్ప, ఆ దేశాన్ని ఏ రైల్వే వ్యవస్థ లేదు. సమీప రైల్వే స్టేషన్ అండోరా-లా-వెల్లాకు బస్సు సర్వీస్ ద్వారా ఫ్రాన్స్ కు అనుసంధానించబడి ఉంది.
⦿ భూటాన్: పొరుగు దేశం భూటాన్ లోనూ ఇప్పటికీ రైల్వే నెట్ వర్క్ లేదు. అక్కడి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లే రైల్వే లైన్లను నిర్మించడం సవాళుగా మారింది. అయినప్పటికీ, భూటాన్ దక్షిణ ప్రాంతాలను భారతీయ రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
⦿ కువైట్: సంపన్న ఆయిల్ కంట్రీ అయిన కువైట్ ఇప్పటికీ రోడ్డు రవాణా మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇప్పుడిప్పుడే రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. వీటిలో 1,200 మైళ్ల పరిధిలో ఉన్నగల్ఫ్ రైల్వే నెట్ వర్క్, కువైట్, ఒమన్ కు కలుపుతుంది.
⦿ మాల్దీవులు: దక్షిణాసియాలోని ద్వీప సముదాయం అయిన మాల్దీవులలో రైల్వే నెట్ వర్క్ లేదు. చిన్న భూభాగం కారణంగా రైల్వే మౌలిక సదుపాయాలకు కల్పన అసాధ్యంగా మారింది. మాల్దీవులలో రోడ్డు, జల, వాయు మార్గాల ద్వారా రవాణా కొనసాగుతోంది.
⦿ గినియా-బిస్సా: పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న గినియా-బిస్సాలో ఇప్పటికీ రైల్వే వ్యవస్థ లేదు. ఈ దేశం ఎక్కువగా రోడ్డు రవాణా మీదే ఆధారపడి ఉంది. 1998లో గినియా-బిస్సా దేశంలో రైల్వే నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి పోర్చుగల్ అంగీకరించింది.
⦿ లిబియా: ఒకప్పుడు ఈ దేశంలో రైల్వే నెట్ వర్క్ ఉన్నా, అంతర్యుద్ధం కారణంగా పూర్తిగా ధ్వంసం అయ్యింది. 1965 నుంచి లిబియా రైల్వే సేవలను కొనసాగించలేదు. 2009 తర్వాత రైల్వే నెట్ వర్క్ పనులు ప్రారంభం అయ్యాయి.
Read Also: ఆకట్టుకునే జలపాతాలు, ఆహా అనిపించే మంచుకొండలు.. జీవితంలో ఒక్కసారైనా ఈ రైలు ప్రయాణాలు చేయాల్సిందే!