Indian Railways Free Benefits: రైలు ప్రయాణం చేసే సమయంలో తన ప్రయాణీకులకు భారతీయ రైల్వే పలు ఉచిత సౌకర్యాలను అందిస్తుంది. కానీ, వాటి గురించి చాలా మందికి తెలియదు. రైలు టికెట్ కొనుగోలు చేసినప్పుడు ఉచితంగా పలు హక్కులను పొందుతారు. వీటిలో ఉచిత బెడ్ రోజుల్స్, ఉచిత ఆహారం సహా పలు సేవలు ఉన్నాయి. ప్రయాణీకులు ఈ ఉచిత సేవలను ఎప్పుడు, ఎలా పొందవచ్చు అనే విషయాలను తెలుసుకుందాం..
⦿ ఉచిత బెడ్‌రోల్: భారతీయ రైల్వేలు అన్ని AC1, AC2, AC3 కోచ్ లలో ప్రయాణీకులకు దుప్పటి, దిండు, రెండు బెడ్‌షీట్లు, హ్యాండ్ టవల్ ను అందిస్తాయి. కానీ, గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణీకులు ఈ సర్వీస్ కోసం రూ. 25 చెల్లించాలి. కొన్ని రైళ్లలో, స్లీపర్ క్లాస్ లో బెడ్ రోల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ప్రయాణ సమయంలో బెడ్ రోల్ దొరకకపోతే.. మీరు ఫిర్యాదు చేసి వాపసు పొందే అవకాశం ఉంటుంది.
⦿ ఉచిత వైద్య సాయం: రైలు ప్రయాణం చేసే సమయంలో అనారోగ్యంగా అనిపిస్తే, రైల్వే ఉచిత ప్రథమ చికిత్స అందిస్తుంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే, వారు మరింత వైద్య సహాయం కూడా ఏర్పాటు చేస్తారు. టికెట్ కలెక్టర్లు, రైలు సూపరింటెండెంట్లు, ఇతర రైల్వే సిబ్బందిని సంప్రదించి ఈ సేవలను పొందే అవకాశం ఉంటుంది. అవసరమైతే, భారతీయ రైల్వే తదుపరి స్టేషన్‌లో ట్రీట్మెంట్ అవకాశాన్ని అందిస్తాయి. అదీ తక్కువ ధరకు.
⦿ ఉచిత ఆహారం: ఒకవేళ మీరు రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుంటే.. మీ రైలు 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే, ఉచిత ఆహారాన్ని అందిస్తాయి. రైలు ఆలస్యంగా వచ్చిన సమయంలో మీకు మంచి ఆహారం కావాలంటే, IRCTC ఇ-క్యాటరింగ్ సేవ ద్వారా భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు.
⦿ స్టేషన్ లో ఒక నెల పాటు లగేజీ పెట్టుకోవచ్చు: పెద్ద రైల్వే స్టేషన్లలో మీరు మీ లగేజీని ఉంచడానికి క్లోక్ రూమ్ లేదంటే లాకర్ గదిని ఉపయోగించవచ్చు. మీరు మీ బ్యాగులను 1 నెల వరకు అక్కడ భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ సౌకర్యం కోసం తక్కువ ఫీజు చెల్లించాలి.
Read Also: హైదరాబాద్ మెట్రోకు ఒక్క రోజులో అంత ఖర్చవుతుందా? అస్సలు నమ్మలేరు!
⦿ ఉచిత వెయిటింగ్ హాల్: మీరు నెక్ట్స్ రైలు కోసం వేచి ఉండాల్సి వస్తే లేదంటే స్టేషన్‌లో కొంత సమయం ఉండాలనుకుంటే, మీరు AC, నాన్-AC వెయిటింగ్ హాల్ లను ఉపయోగించవచ్చు. అందులోకి ఎంట్రీ ఇవ్వడానికి మీ రైలు టికెట్ ను చూపిస్తే సరిపోతుంది. చాలా రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు ఈ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. సో, ఇకపై మీరు కూడా రైల్వే ప్రయాణ సమయంలో అవసరం అయితే, రైల్వే కల్పించే ఈ ఉచిత సౌకర్యాలను హాయిగా పొందండి.
Read Also: ఈ నగరంలో అస్సలు ట్రాఫిక్ జామ్ లే ఉండవు.. ఎక్కడో కాదు ఇండియాలోనే!