దేశంలో ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2030 వరకు ఈ మార్గంలో బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ టార్గెట్ కు అనుగుణంగా శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలు నెట్ వర్క్ ను విస్తరించే ప్రణాళికలను రైల్వేశాఖ వేగవంతం చేసింది. అందులో భాగంగానూ హైస్పీడ్ రైలు కనెక్టివిటీ కోసం సౌత్ ఇండియాలో తొలి బుల్లెట్ రైలు కారిడార్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.
దక్షిణ భారతంలో తొలి బుల్లెట్ రైలును హైదరాబాద్- చెన్నై మార్గంలో తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది. నవరత్న PSU అయిన RITES ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని కొనసాగిస్తోంది. RITES ద్వారా సాధ్యాసాధ్యాల అధ్యయనం, ట్రాఫిక్ విశ్లేషణ, డిమాండ్ అంచనాలు, అలైన్ మెంట్ సర్వేలు సహా పలు అంశాలను నిర్ణయించనుంది. ఆ తర్వాత హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైలు కారిడార్ కోసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(DPR)ను సిద్ధం చేయనుంది.
హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే, వేగం, సౌకర్యం, కనెక్టివిటీలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రెండు నగరాల మధ్య సమయాన్ని 12 గంటల నుంచి కేవలం 2 గంటల 20 నిమిషాలకు (140 నిమిషాలు) తగ్గనుంది.
ఈ ఏడాది ఆగస్టులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియాలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సర్వేకు ఆదేశించినట్లు ప్రకటించారు. ప్రతిపాదిత బుల్లెట్ రైలు నెట్ వర్క్ సౌత్ ఇండియాలోని నాలుగు నగరాలను కలుపుతుందన్నారు. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు మధ్య ప్రయాణా సమయాన్ని మరింత తగ్గిస్తుందన్నారు. “అతి త్వరలో సౌత్ ఇండియాకు బుల్లెట్ రైలు రాబోతోంది. ఇప్పటికే రైల్వేశాఖ సర్వేకు ఆదేశించింది. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు, నాలుగు నగరాలను ఈ ప్రాజెక్టు కలపనుంది. 5 కోట్లకు పైగా జనాభా, ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఏపీకి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడనుంది” అన్నారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ‘ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో ఈ విషయాన్ని వెల్లడించారు.
గతంలో రైల్వేశాఖ దేశంలోని స్పీడ్ రైలు నెట్ వర్క్ అభివృద్ధి కోసం ఈ క్రింది మార్గాలను ప్రస్తావించింది:
⦿ ఢిల్లీ – వారణాసి
⦿ ఢిల్లీ – అహ్మదాబాద్
⦿ ముంబై – నాగ్‌పూర్
⦿ ముంబై – హైదరాబాద్
⦿ చెన్నై – మైసూర్
⦿ ఢిల్లీ – అమృత్‌సర్
⦿ వారణాసి – హౌరా
వీటికి తోడుగా ఇప్పుడు హైదరాబాద్-చెన్నై మార్గం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతోంది. ఈ మార్గం హైదరాబాద్, చెన్నై మార్గంలో రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
Read Also: హైదరాబాద్ నుంచి వెళ్లే ఈ వందేభారత్ రైళ్లలో కీలక మార్పులు.. ఈ రోజుల్లో ఉండవట!