Two Phones and Headphones While Driving: హైదరాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ చేసిన కేర్ లెస్ డ్రైవింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాల్సిన డ్రైవర్.. డ్రైవింగ్ చేస్తూనే రెండు మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్లతో కనిపించడం షాక్ కు గురి చేసింది. ఈ వీడియోపై స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. సదరు ఆటో డ్రైవర్ను గుర్తించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆటో డ్రైవర్ ముందు రెండు మొబైల్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఒక ఫోన్లో డెస్టినేషన్ కు వెళ్లే నావిగేషన్ రూట్ ఉండగా, మరో ఫోన్ లో సినిమా చూస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా చెవులకు పెద్ద హెడ్ఫోన్లు పెట్టుకుని ఆటో నడుపుతున్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డ్రైవింగ్ టైమ్ లో రోడ్డుపై పూర్తి దృష్టి పెట్టాల్సిన వ్యక్తి ఇలా ఇతర విషయాలపై దృష్టి మళ్లించడం ప్రమాదాలకు దారితీయవచ్చని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను కూడా ఈ నిర్లక్ష్యం ప్రమాదంలో పడేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. టీజీ15యూ2657 నంబర్ ఉన్న ఆటోను గుర్తించి, దాని డ్రైవర్పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ లాంటి డివైజెస్ తో దృష్టి మళ్లించడం ఎంత ప్రమాదకరమో? ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
వాహనం నడిపేటప్పుడు కొన్ని క్షణాల పాటు దృష్టి రోడ్డుపై నుంచి పక్కకు మళ్లినా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటిది సినిమా చూస్తూ, హెడ్ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేయడం మరింత ప్రమాదకరం. టూవీలర్, కారు, ఆటో, బస్సు, లారీ.. ఏ వాహనం నడిపినా డ్రైవర్ అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. ఇలాంటి ప్రవర్తనపై మోటార్ వెహికల్స్ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ మొబైల్ చూస్తున్నా, హెడ్ఫోన్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నా ప్రయాణికులు సైలెంట్ గా ఉండకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ముందుగా వెహికల్ ఆపాలని కోరాలి. డ్రైవర్ వినకపోతే, డయల్ 112కు సమాచారం అందించాలన్నారు. ఎంటర్ టైన్ మెంట్ కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఎంతమాత్రం మంచిది కాదన్నారు. డ్రైవింగ్ సమయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరి భద్రతకు సంబంధించిన అంశం అనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు.
రెండు కళ్లకు ఎదురుగా రెండు ఫోన్లు.. ఒకదాంట్లో గమ్యం చూపించే నేవిగేషన్ రూట్, మరోదాంట్లో నాన్స్టాప్ వినోదాన్ని పంచే సినిమా! ఇక చెవులకేమో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా రంగురంగుల లైట్లు వెలిగే పెద్ద హెడ్ఫోన్లు!
ఇది ఒక ఆటో డ్రైవర్ అధునాతన సెటప్. ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా ఈ… pic.twitter.com/x7fQZuH8Iv
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) October 14, 2026
Read Also: డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!