Hyderabd Zoo Park: హైదరాబాద్ అనగానే చార్మినార్ ఎలా గుర్తొస్తుందో, నెహ్రూ జూలాజికల్ పార్క్ అలాగే గుర్తొస్తుంది. భాగ్యనగరం పర్యటనకు వచ్చిన ఎవరైనా జూ పార్క్ ను కచ్చితంగా విజిట్ చేయాల్సిందే. దేశంలోని అతిపెద్ద జూలలో ఒకటైన హైదరాబాద్ జూ పార్క్ లో పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలిగే చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
హైదరాబాద్ జూ పార్క్ లో నైట్ సఫారీ
తాజాగా జూలలో నైట్ సఫారీలపై నిషేధాన్ని సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (CZAI) ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో నైట్ సఫారీని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, నైట్ సఫారీ ప్రణాళిక ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఏడాది లోగా ఈ సఫారీని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
నైట్ సఫారీ టైమింగ్స్ ఇవే!
రాత్రి వేళలో ఈ సఫారీని అందుబాటులో ఉంచనున్నట్లు జూ అధికారులు తెలిపారు. నైట్ టైమ్ లో జూలోని జంతువులు, పక్షులు, ఇతర జీవులను చూసేందుకు ఇష్టపడే వారికి ఈ సఫారీ మరింత ఆహ్లాదాన్ని అందిస్తుందన్నారు. ఈ సఫారీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య నడిచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
హైదరాబాద్ జూ గురించి..
హైదరాబాద్ బహదూర్ పురాలోని మీర్ ఆలం ట్యాంక్ సమీపంలో నెహ్రూ జూ పార్క్ ఉంది. గతంలో ఈ జూ పబ్లిక్ గార్డెన్స్ లో ఉండేది. ఆ తర్వాత జూ ఎన్ క్లోజర్లను అక్కడికి తరలించారు. అక్టోబర్ 6, 1963న బహదూర్ పురాలో ఈ జూ ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 26, 1959న ఈ జూ పనులు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ నిర్మాణం నాలుగు సంవత్సరాలు పట్టింది. ఈ జూ పార్క్ మీర్ ఆలం ట్యాంక్ బండ్‌ను ఆనుకుని ఉంది. ఇది 200 సంవత్సరాల క్రితం ఏర్పడిన 24 ఆర్చ్ లతో కూడిన స్వదేశీ ఆర్చ్ బండ్ ఆనకట్ట.
Read Also: కారు అంత బరువున్న రాకాసి పాము.. ఇంకా పెరుగుతూనే ఉందట!
జూలో 2,240 రకాల జంతువులు
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మొత్తం 2,240 జంతువులు ఉన్నాయి. వీటిలో 55 జాతులకు చెందిన 664 క్షీరదాలు, 97 జాతులకు చెందిన 1,227 పక్షులు, 38 జాతులకు చెందిన 341 సరీసృపాలు, 2 జాతులకు చెందిన 8 ఉభయచరాలు ఉన్నాయి. జూ సహజ ప్రకృతి అందాలు, పలు రకాల నివాస, వలస పక్షులతో కనువిందు చేస్తుంది. పర్యాటకులను ఈ జూపార్క్ ఎంతగానో ఆకర్షిస్తుంది.
Read Also: ఈ వైరల్ ఫొటోలో ఉన్న పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? చూస్తే షాకవుతారు!