Weekend Trip: హైదరాబాద్‌లో ఉద్యోగం, ట్రాఫిక్, రోజువారీ రొటీన్‌తో బిజీగా ఉండే చాలామందికి వీకెండ్ వస్తే కాస్త రిలాక్స్ అవుతూ ఎక్కడికైనా చిన్న ట్రిప్ వెళ్లాలనిపిస్తుంది. కానీ ట్రిప్ అంటే ఖర్చు ఎక్కువవుతుందని చాలామంది ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తుంటారు. నిజానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటే పెద్ద బడ్జెట్ అవసరం లేదు. బస్, షేర్డ్ క్యాబ్ లేదా సొంత వాహనంతో హైదరాబాద్ నుంచి రూ.5,000లోపే మంచి వీకెండ్ ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, అడ్వెంచర్, ప్రశాంతమైన వాతావరణం.. ఇలా ఒక్కో ప్రదేశం ఒక్కో ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. మరి హైదరాబాద్ నుంచి తక్కువ ఖర్చుతో వీకెండ్‌లో వెళ్లొచ్చే ఆ 5 బెస్ట్ ప్రదేశాలేంటో చూద్దామా!
హైదరాబాద్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండలు వీకెండ్ బ్రేక్‌కు బాగా సెట్ అవుతాయి. పచ్చని అడవి, చల్లని గాలి, వాకింగ్ ట్రైల్స్, వ్యూ పాయింట్లు మనసుకు కాస్త రిలీఫ్ ఇస్తాయి. ఉదయాన్నే బయలుదేరితే ఒక రోజులోనే తిరిగి రావచ్చు. రాత్రి ఉండాలనుకుంటే బడ్జెట్ స్టేలు కూడా ఉన్నాయి. ప్రయాణం, భోజనం, స్టే కలిపి సాధారణంగా రూ.1,500 నుంచి రూ.3,000లో ప్లాన్ చేయొచ్చు. స్నేహితులతో బైక్ ట్రిప్‌కు కూడా ఇది మంచి ఆప్షన్.
చరిత్ర అంటే ఇష్టమున్నవాళ్లకు వరంగల్ మంచి ఎంపిక. హైదరాబాద్ నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రెండు రోజుల ట్రిప్‌గా సులభంగా ప్లాన్ చేయొచ్చు. వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప పరిసరాలు చూస్తూ రోజు గడిచిపోతుంది. మధ్యలో చెరువుల దగ్గర కాసేపు ఆగితే ట్రిప్ మరింత హాయిగా ఉంటుంది. బస్ లేదా షేర్డ్ ట్రాన్స్‌పోర్ట్ ఎంచుకుని, సాధారణ హోటల్‌లో ఉంటే రూ.2,000 నుంచి రూ.4,000లో ట్రిప్ పూర్తయ్యే అవకాశం ఉంది.
Also Read: ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి టీవీల వరకు.. Flipkart Big Billion Days డేట్స్ వచ్చేశాయోచ్!
లాంగ్ డ్రైవ్ చేయాలని, నీటి దగ్గర కాసేపు రిలాక్స్ అవ్వాలని అనిపిస్తే నాగార్జునసాగర్ బాగుంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 150 నుంచి 165 కిలోమీటర్ల దూరం. డ్యామ్ వ్యూ, బోటింగ్, నాగార్జునకొండ మ్యూజియం, దగ్గర్లోని ఎత్తిపోతల జలపాతం ట్రిప్‌లో ఆసక్తి పెంచుతాయి. తెలంగాణ టూరిజం వీకెండ్‌లలో హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు వన్‌డే టూర్‌ను రూ.800కు అందిస్తోంది. అయితే బోటింగ్, ఎంట్రీ, భోజనం అదనంగా ఉంటాయి. సొంత వాహనం లేదా షేర్డ్ ట్రావెల్‌తో రూ.2,000 నుంచి రూ.3,500లో ప్లాన్ చేయొచ్చు.
హైదరాబాద్ నుంచి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్ ఒక చిన్న రోడ్ ట్రిప్‌కు బాగుంటుంది. బీదర్ కోట, పురాతన కట్టడాలు, ప్రశాంతమైన వీధులు చూస్తూ నెమ్మదిగా తిరగొచ్చు. పెద్దగా పరుగులు పెట్టకుండా ఒక రాత్రి ఉండి మరుసటి రోజు తిరిగి వస్తే ట్రిప్ హాయిగా ఉంటుంది. బస్ లేదా షేర్డ్ క్యాబ్‌తో వెళ్లి, బడ్జెట్ హోటల్ ఎంచుకుంటే ప్రయాణం, భోజనం, స్టే కలిపి సుమారు రూ.2,500 నుంచి రూ.4,000లోపే ఉంచొచ్చు.
నల్లమల అడవుల మధ్యు సాగే ప్రయాణమే శ్రీశైలం ట్రిప్‌లో ప్రత్యేక ఆకర్షణ. హైదరాబాద్ నుంచి దాదాపు 210 కిలోమీటర్ల దూరం. మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీశైలం డ్యామ్, పాతాళగంగ వంటి ప్రదేశాలు చూడొచ్చు. బస్‌లో వెళ్లడం లేదా షేర్డ్ వాహనం తీసుకోవడం ద్వారా ఖర్చు తగ్గించవచ్చు. తెలంగాణ టూరిజం నాన్ ఏసీ బస్, వసతితో కూడిన రెండు రోజుల ప్యాకేజీని పెద్దలకు రూ.2,000కి అందిస్తోంది. భోజనం, దర్శనం వంటి ఖర్చులు అదనం. మొత్తంగా సరైన ప్లాన్‌తో రూ.3,000 నుంచి రూ.5,000లో వీకెండ్ పూర్తి చేయొచ్చు. ఇలా చూస్తే, ఖర్చు తగ్గించుకుని కూడా ఫుల్ ఎంజాయ్ చేసే వీకెండ్.
Also Read: రూ.9,000 డిస్కౌంట్‌తో శాంసంగ్ గెలాక్సీ A56 5G.. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ మళ్లీ రాదు!