Indian Railway Minister: భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నారు. రైళ్లలో ప్రయాణించే చాలా మంది ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. దేశ వ్యాప్తంగ రోజూ 16 లక్షల మంది ప్రయాణీకులకు భోజనాలు అందిస్తున్నట్లు తాజాగా రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
రోజూ 16 లక్షల మందికి భోజనం
తాజాగా లోక్ సభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వైష్ణవ్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ బేస్ కిచెన్‌ల కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందన్న ఫిర్యాదులతో పాటు పార్లమెంటు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. “భారత రైల్వే నెట్ వర్క్ లో రోజుకు సగటున 16 లక్షల భోజనాలు అందిస్తున్నాం. ప్రయాణీకులకు మొత్తం సేవలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం” అని చెప్పుకొచ్చారు. రైళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతను మెరుగుపరచాలనే లక్ష్యంతో బేస్ కిచెన్ ల నుంచి మాత్రమే రైళ్లలో భోజన సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రైల్వే సూచల ప్రకారం, సర్వీస్ లొకేషన్లతో బేస్ కిచెన్లను ప్రారంభించినట్లు తెలిపారు.
బేస్ కిచెన్ల టెండర్లపై కీలక వివరణ
ఇక భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణీకులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందు బేస్ కిచెన్లకు సంబంధించిన టెంటర్ ప్రక్రియ కొనసాగిందన్నారు వైష్ణవ్. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఇ-ఓపెన్ టెండర్ ప్రక్రియ ద్వారా కాంట్రాక్టులు ఇచ్చినట్లు వివరించారు. “IRCTC 168 క్లస్టర్ల కాంట్రాక్టులను ఇచ్చింది. వీటికి మొత్తం 653 బిడ్‌లు వచ్చాయి. క్లస్టర్లు రెండు గ్రూపులుగా ఉన్నాయి, అవి ప్రీమియం ప్రీపెయిడ్ రైళ్లు, ప్యాంట్రీ కార్లతో కూడిన మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లుగా విభజించి టెంటర్లు ప్రక్రియ కొనసాగించాం” అని తెలిపారు. “బేస్ కిచెన్ల నుంచి రైళ్లకు భోజన సరఫరా జరుగుతుంది. అధిక-నాణ్యత కలిగిన సరుకులు, ప్యాకేజింగ్ మెటీరియల్ తో కూడిన ప్రమాణిక వంట గదులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా నాణ్యమైన ఆహారాన్ని ప్రయాణీకులకు అందిస్తున్నాం” అని రైల్వే మంత్రి వివరించారు.
Read Also: ఇండియన్ రైల్వేకు 500వ ఎలక్ట్రిక్ లోకోమోటివ్, సరుకు రవాణాలో ఇక దూకుడే!
దేశ వ్యాప్తంగా 717 బేస్ కిచెన్లు
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 717 బేస్ కిచెన్లను ప్రారంభించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. “మార్చి 15 నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 717 బేస్ కిచెన్‌లు ప్రారంభించబడ్డాయి. పలు హైకోర్టులలో క్లస్టర్ ఆధారిత టెండరింగ్ కు వ్యతిరేకంగా మొత్తం 17 సివిల్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 14 కేసులు భారతీయ రైల్వేలు/IRCTCకి అనుకూలంగా వచ్చాయి. మరో 3 కేసులు విచారణ కోసం పెండింగ్ లో ఉన్నాయి” అన్నారు. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా నాణ్యమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా రైల్వే సంస్థ పని చేస్తున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు.
Read Also: భారతీయ రైల్వేలో మరో కలికితురాయి, పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
Read Also: కశ్మీర్‌ను ఇక రైల్లో చుట్టేయొచ్చు.. ఏయే ప్రాంతాలను చూడొచ్చు అంటే?