Indian Railways: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ రైల్వే గణనీయంగా అభివృద్ధి సాధించిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే ఆధునికీకరణలో ప్రధాని ఓ చోదకశక్తిగా మరారని కొనియాడారు. రాజస్థాన్ లోని బికనీర్ లో జరిగిన 103 అమృత్ భారత్ స్టేషన్ల జాతికి అంకితం కార్యక్రమంలో వైష్ణవ్ పాల్గొని ప్రసంగించారు. గత 11 ఏళ్లలో ప్రధాని మోడీ రైల్వే ప్రాథమిక నిర్మాణంలో అద్భుతమైన సంస్కరణలు చేశారన్నారు. దశాబ్ద కాలంలో ఏకంగా 34,000 కి.మీ.లకు పైగా కొత్త రైల్వే పట్టాలు నిర్మించినట్లు చెప్పారు.
జర్మనీ రికార్డును బ్రేక్ చేశాం!
గత 11 ఏళ్లలో కొత్త రైలు పట్టాల నిర్మాణంలో సరికొత్త రికార్డులు నెలకొల్పినట్లు అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు కూడా సాధ్యం కాని రీతిలో అత్యంత వేగంగా రైలు పట్టాలను నిర్మించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నిరంతర పర్యవేక్షణ కారణంగా దేశంలో 47,000 కిలో మీటర్ల మేర విద్యుదీకరణ చేసినట్లు వివరించారు. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ సిరీస్ రైళ్లు భారతీయ రైల్వేకు ముఖచిత్రంగా మారాయన్నారు. భారత రైల్వే పాత ఐసిఎఫ్ కోచ్ లను ఎల్‌హెచ్‌బి కోచ్ లుగా శరవేగంగా మార్చుతున్నట్లు తెలిపారు. గత 11 సంవత్సరాలలో 42,000 కొత్త ఎల్‌హెచ్‌బి కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
సౌకర్యంతో పాటు భద్రతకు ప్రాముఖ్యత
రైల్వే సంస్థ భద్రతతో పాటు సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సేవలలో భారత రైల్వేలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మార్చుతున్నట్లు తెలిపారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు రైలు ప్రయాణాన్ని మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైల్వేల మీద మోడీ మాదిరిగా ఫోకస్ పెట్టిన ప్రధానమంత్రి మరొకరు లేరని కొనియాడారు.
Read Also: గాలొస్తే గలగలా.. వానొస్తే లొడలొడా.. ఇదీ.. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన చర్లపల్లి స్టేషన్ దుస్థితి!
1,062 రైల్వే స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన
2024-24 సంవత్సరంలో ఏకంగా 1,062 రైల్వే స్టేషన్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తాజాగా దేశ వ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను ఒకేసారి ప్రారంభించారని చెప్పారు. మరో 8 నెలల్లో ఇంకో 100 రైల్వే స్టేషన్లు ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందన్నారు. 2027 నాటికి 500 రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తామని తెలిపారు. ప్రధాని మోడీ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు భారతీయ రైల్వే ముందుకు సాగుతుందన్నారు. అభివృద్ధిలోనూ రైల్వే నిరంతరం సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందన్నారు. మరికొద్ది రోజుల్లోనే స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతుందన్నఆయన.. రైల్వే చరిత్రలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా గుర్తింపు పొందబోతున్నాయన్నారు. రానున్న రోజుల్లో బుల్లెట్ రైళ్లు, హైడ్రోజన్ రైళ్లు భారతీయ రైల్వేను మరింత బలోపేతం చేస్తాయన్నారు అశ్వినీ వైష్ణవ్.
Read Also: ఏం వాడకమయ్యా.. డ్రోన్లతో రైలు బోగీల క్లీనింగ్, ఎక్కడో కాదు ఇక్కడే!