Secunderabad- Visakhapatnam Vande Bharat Express Update: దేశ వ్యాప్తంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. అన్ని రూట్లలో వంద శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వందేభారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 5 వందేభారత్ రైళ్లు సేవలను అందిస్తున్నాయి. అన్ని రైళ్లలో మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతున్నది. వీటికి తోడుగా మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రవేశ పెట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ రైలును నడపాలనే ప్రతిపాదనపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఇకపై 20 కోచ్ లతో సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ ప్రెస్
ఇక సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడుస్తున్న సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రయాణీకుల నుంచి తాకిడి పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ రైలుగా ఎంట్రీ ఇచ్చిన ఈ ఎక్స్ ప్రెస్ కు ఆక్యపెన్సీ రేషియో రోజు రోకు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ రైలును అప్ గ్రేడ్ చేస్తూ రైల్వేశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇవాళ్టి నుంచి ఈ రైలు 20 కోచ్ లతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 16 కోచ్ లతో నడుస్తుండగా, ఇప్పుడు మరో నాలుగు కోచ్ లు యాడ్ అవుతున్నాయి. ఈ నిర్ణయంతో వెయిటింగ్ లిస్టులో ఉంటున్న ప్రయాణీకులకు ఉపశమనం కలగనుంది. విశాఖ- సికింద్రాబాద్ నడుమ ప్రయాణాలు కొనసాగించే వారికి ఈ రైలు అనుకూలంగా ఉండటంతో ఎక్కేందుకు ఇష్టపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ స్లీపర్ రైళ్లు
ప్రస్తుతం వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలు ఎక్కించేందకు వేగంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రైలు ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. ఈ టెస్టులు పూర్తి కాగానే, తొలి విడుతలో సుమారు 10కి పైగా వందేభాతర్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాలకు ఓ వందేభారత్ స్లీపర్ రైలును కేటాయించనున్నట్లు తెలుస్తున్నది. ఈ రైలును విశాఖ నుంచి తిరుపతికి లేదంటే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిపించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
Read Also:వచ్చేస్తోంది హైడ్రోజన్ రైలు, దీని పవర్ ముందు మిగతావన్నీ దిగదుడుపే!
రెండో విడుతలో మరో రెండు స్లీపర్ రైళ్లు!
తొలి విడుతలో ఓ వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుండగా, రెండో విడుతలో మరో రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తున్నది. వీటిలో ఓ రైలు సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి, మరో రైలు విశాఖపట్నం నుంచి అయోధ్యకు నడపాలని రైల్వే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. అటు ఏపీ నుంచి బెంగళూరుకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును నడపాలని ప్రయాణీకుల నుంచి డిమాండ్ వినిపిస్తున్నది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని, విడతల వారీగా తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లను కేటాయించనున్నట్లు తెలుస్తున్నది.
Read Also:సంక్రాంతి వెళ్లేవారికి గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే