Trains CCTV Cameras| రైల్వే ప్రయాణికుల భధ్రతను మెరుగుపరచడానికి, రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం దాని గురించి అధికారికంగా ప్రకటించింది. అన్ని ప్యాసెంజర్ కోచ్‌లు, లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దేశంలోని మొత్తం 74,000 కోచ్‌లు, 15,000 లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదం తెలిపారు. అంతకుముందు ఉత్తర రైల్వేకు చెందిన లోకో ఇంజన్లు, కోచ్‌లలో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షలకు సానుకూల స్పందన రావడంతో ఇక దేశ వ్యాప్తంగా ఉన్న రైళ్లలో కూడా సిసిటీవి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
దొంగలు, వ్యవస్థీకృత గుండా గ్యాంగ్‌లు.. సామాన్య ప్రయాణికులపై దాడులు చేయడం, వారిని దోచుకోవడం వంటి సంఘటనలను సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా గణనీయంగా తగ్గించడం రైల్వే శాఖ లక్ష్యం. “ప్యాసెంజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ప్రయోగాత్మక ఏర్పాటు సానుకూల ఫలితాలను ఇచ్చింది. అందుకే, అన్ని కోచ్‌లలో కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. ఈ చర్య ప్రయాణికుల సురక్షను గణనీయంగా మెరుగుపరుస్తుంది,” అని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
రైలు ప్రయాణ సమయంలో భద్రత కోసం ప్రతి రైలు కోచ్‌లో నాలుగు డోమ్ రకం CCTV కెమెరాలు ఏర్పాటు చేస్తారు. రెండు కెమెరాలు ప్రతి ద్వారం వద్ద ఉంటాయి. ఇక లోకోమోటివ్‌లలో ఆరు కెమెరాలు ఉంటాయి.. ముందు, వెనుక, రెండు వైపులా ఒక్కో కెమెరా.
రైల్వే మంత్రి వైష్ణవ్.. ఉన్నతాధికారులతో సమావేశంలో పాల్గొన్నాక ఈ నిర్ణయం గురించి ప్రకటించారు. గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లలోనూ, తక్కువ వెలుతురు పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత గల వీడియో ఫుటేజ్ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కెమెరాల ద్వారా సేకరించిన డేటాను ఇండియాAI మిషన్‌తో కలిసి కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి విశ్లేషించబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ AI టెక్నాలజీ.. రైలు ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేస్తుంది. ఈ ప్రణాళిక రైల్వే వ్యవస్థలో సురక్షిత, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.
Also Read: అమెరికాలో మాంసాహారం తినే ఈగల బెడద.. చనిపోతున్న పశువులు..
డేటా ప్రైవెసీ కోసం జాగ్రత్తలు
సిసిటీవి కెమెరాలు ఏర్పాటు చేసినా.. ప్రయాణికుల గోప్యతను కాపాడేందుకు రైల్వే శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. సీసీటీవీ కెమెరాలను కేవలం సామాన్య ప్రాంతాల్లో, తలుపుల సమీపంలోనే ఏర్పాటు చేస్తారు. “కోచ్‌లలో సామాన్య ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే మా లక్ష్యం,” అని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సీసీటీవీ కార్యక్రమంలో డేటా ప్రైవెసీ కి అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.