Railway Festival Special Trains: దసరా, దీపావళి పండుగలు దగ్గరపడుతున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైళ్లకు డిమాండ్ మరింత పెరగనుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకున్న భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు అదనపు రైలు సదుపాయం కల్పించేందుకు 102 పండుగ ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపాలని నిర్ణయించింది.
ఈ ప్రత్యేక రైళ్ల సేవలు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 24, 2026 వరకు అందుబాటులో ఉంటాయని సోలాపూర్ డివిజన్ వెల్లడించింది. పండుగల సమయంలో ప్రయాణికులు టికెట్ల కోసం ఇబ్బంది పడకుండా, ప్రధాన రూట్లలో అదనపు సర్వీసులు అందించడమే లక్ష్యంగా ఈ రైళ్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను గుర్తించి రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రత్యేక రైళ్లలో కొల్హాపూర్–కలబురగి మార్గానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రూట్ లోనే 64 ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. పండుగల సమయంలో ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేయడంతో అదనపు రైళ్లను ఏర్పాటు చేశారు. అటు ముంబై నుంచి చెన్నై వెళ్లే ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. CSMT ముంబై–చెన్నై బీచ్ వీక్లీ స్పెషల్ రైలు ప్రతి దిశలో ఆరు ట్రిప్పులు నడపనుంది. ముంబై నుంచి ఈ రైలు ప్రతి బుధవారం అర్ధరాత్రి 00:35 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 23:30 గంటలకు చెన్నై బీచ్ చేరుకుంటుంది. ఈ సర్వీసులు అక్టోబర్ 14 నుంచి నవంబర్ 18 వరకు ఉంటాయి. దాదర్, థానే, కళ్యాణ్, పుణే, సోలాపూర్, కలబురగి, రాయచూర్, రేణిగుంట లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఈ రైలుకు హాల్టులు ఉంటాయి. తిరుగు ప్రయాణ సర్వీసులు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 19 వరకు నడుస్తాయి.
లాతూర్ నుంచి ముంబై వెళ్లే ప్రయాణికులకు కూడా ప్రత్యేక రైలు సదుపాయం కల్పించారు. రైలు నంబర్ 01106 లాతూర్ నుంచి సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:10 గంటలకు CSMT ముంబై చేరుకుంటుంది. కుర్దువాడి, బార్షి టౌన్, ధరాశివ్, పుణే, థానే వంటి స్టేషన్లలో ఈ రైలుకు హాల్టులు ఉంటాయి. లాతూర్–ముంబై ప్రత్యేక రైలులో మొత్తం 22 ICF కోచ్‌లు ఉంటాయి. ఇందులో 4 AC 3-టైర్ కోచ్‌లు, 11 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 5 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి.
ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ రిజర్వేషన్లు సెప్టెంబర్ 27, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రయాణికులు అధికారిక IRCTC వెబ్‌సైట్, RailOne యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: రైలు అద్దం నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చిన రాయి.. దురంతోపై దాడి? ఇదిగో ఆ షాకింగ్ వీడియో!