బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై కోర్టుకెక్కాడు. అధికారుల పట్టని తనం కారణంగా తన కుటుంబం కుంభమేళాకు వెళ్లలేకపోయిందన్నాడు. పవిత్ర మౌని అమావాస్య నాడు కుంభమేళాలో పుణ్యస్నానం చేయలేకపోయామని ఆరోపించాడు. తమ సెంటిమెంట్ కు భంగం కలిగించిన ఇండియన్ రైల్వే రూ. 50 లక్షలు పరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపాడు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
జనవరి 26న స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ కు AC-3 టిక్కెట్లు ఉన్నప్పటికీ, కోచ్ తలుపు లోపలి నుండి లాక్ చేయడంతో తాను, తన కుటుంబం రైలు ఎక్కలేకపోయామని గైఘాట్ ప్రాంతానికి జనక్ కిషోర్ ఝా ఆరోపించారు. రైల్వే సిబ్బందిని తాము రైలు ఎక్కేలా చూడాలని కోరినా సహకరించలేదన్నారు. చివరకు తమ కుటుంబం లోపలికి వెళ్లకుండానే రైలు వెళ్లిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఝా అధికారికంగా భారత రైల్వే బోర్డు ఛైర్మన్ ను 15 రోజుల్లోపు తన టికెట్ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్ణీత సమయం లోపు డబ్బును ఇవ్వకపోతే రూ. 50 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉందని నోటీసులు పంపించారు.
సెంటిమెంట్ కు భంగం కలిగింది!
రైల్వే నిర్లక్ష్యం వల్ల తాను, తన కుటుంబం 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరు కాలేకపోయామన్నారు ఝా. రైల్వే అధికారులు చేసిన పనికి ఆర్థికంగా నష్టపోవడమే సెంటిమెంట్ దెబ్బతిన్నదన్నారు. “నేను, మా అత్తమామలతో కలిసి ముజఫర్ పూర్ నుంచి ప్రయాగరాజ్ కు AC-3 టిక్కెట్లను బుక్ చేసుకున్నాను. రైలు ప్లాట్ ఫారమ్ దగ్గరికి వచ్చినప్పుడు, మా కోచ్ తలుపు లోపలి నుండి లాక్ చేయబడి ఉన్నాయి. మేము ప్రయత్నించినప్పటికీ, ఎవరూ తెరవలేదు. రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరో కోచ్ లోకి ఎక్కలేకపోయాం. స్టేషన్ మాస్టర్, రైల్వే పోలీసులను అడిగి తమ కోచ్ డోర్లు ఓపెన్ చేసేలా చూడాలన్నారు. కానీ, వారి నుంచి ఎలాంటి సాయం అందించబడలేదు. ఇది పూర్తిగా రైల్వే నిర్లక్ష్యం. అందుకే, తమ డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశాం. గడువులోగా ఇవ్వకపోతే రూ. 50 లక్షలు పరిహారం చెల్లించాలని నోటీసు పంపించాం” అని తెలిపారు.
కోర్టులో ఏం వాదించారంటే?
ఝా తరఫున న్యాయవాది కోర్టులో వినియోగదారుల రక్షణ చట్టం కింద నోటీసులు పంపించారు. ప్రయాణీకులు నిర్ణీత రైలులో సురక్షితంగా ఎక్కి సకాలంలో గమ్యస్థానానికి చేరుకునేలా రైల్వే అధికారుల చూసుకోవాలని వాదించారు. అలా చేయడంలో విఫలమైతే ఫిర్యాదుదారుడు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. “రైల్వే తన విధి నిర్వహణలో విఫలం అయ్యింది. తన డబ్బులను తిరిగి చెల్లించడానికి రైల్వేబోర్డు ఛైర్మన్‌కు 15 రోజుల గడువు ఇస్తూ నోటీసు పంపించాం. అధికారులు దీనిని పాటించకపోతే, కోర్టును ఆశ్రయించి పరిహారం కోరుతాం” అన్నారు.
Read Also: రైలు ఆలస్యమైందనే కోపంతో.. ఏకంగా సొంత రైల్వే సంస్థను పెట్టేశాడు!