Indian Railways Electrification: భారతీయ రైల్వేలో రోజు రోజుకు మరింది అభివృద్ధి చెందుతున్నది. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నది. దేశంలో బ్రిటిష్ కాలంలో మొదలైన రైల్వేల నిర్మాణం.. స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేసింది. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించాయి. 7301 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం 20 వేలకు పైగా రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సుమారు 2.5 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు.
ఫిబ్రవరి 3న విద్యుదీకరణ శతాబ్ది వేడుకలు
భారతీయ రైల్వే సంస్థ అరుదైన ఘనత సాధించింది. రైల్వేలో విద్యుదీకరణ మొదలై 100 ఏండ్లు అవుతున్నది. అంటే.. తొలిసారి విద్యుత్ రైలు పట్టాలెక్కి 100 సంవత్సరాలు నిండింది. అంతకు ముందుకు స్ట్రీమ్ లోకోమోటివ్ లు సేవలు అందించేవి. ఫిబ్రవరి 3, 1925న తొలి ఎలక్ట్రిక్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్(CSMT)- కుర్లా మధ్య ఈ రైలు పరుగులు తీసింది. భారతీయ రైల్వేలో ఇదో కీలక మైలు రాయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3 విద్యుదీకరణకు శతాబ్ది ఉత్సవాలను జరిపేందుకు రైల్వేశాఖ రెడీ అయ్యింది. తొలి విద్యుత్ రైలు పట్టాలెక్కిన ముంబై రైల్వే స్టేషన్ లోనే ఈ వేడుకలు జరపనున్నట్లు భారతీయ రైల్వే సంస్థ వెల్లడించింది. “వందేళ్ల విద్యుదీకరణ వేడుకలను ఫిబ్రవరి 3న ముంబై రైల్వే స్టేషన్ లో ప్రారంభిస్తున్నాం. ఉదయాన్ని రన్ నిర్వహిస్తాం. ఆ తర్వాత స్మారకోత్సవం జరుపుతాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లో టెక్నికల్, ఇతర సెమినార్లు నిర్వహిస్తాం. ఆ తర్వాత పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం” అని రైల్వే CRPO నీలా వెల్లడించారు.
పలు జోన్లలో 100 శాతం విద్యుదీకరణ
శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో భారతీయ రైల్వే విద్యుదీకరణ వైపు మొగ్గు చూపింది. ప్రస్తుతం భారతీయ రైల్వే 1500V DC సిస్టమ్ నుంచి అధునాతన 25kV AC నెట్ వర్క్ కు మారింది. వేగాన్ని మెరుగుపరచడం, ఖర్చులను తగ్గించడం, కర్బన ఉద్గారాలను కంట్రోల్ చేసే లక్ష్యంతో విద్యుదీకరణను విస్తరించారు. దేశంలోని కొన్ని జోన్లలో నూటికి నూరుశాతం విద్యుదీకరణతో రైళ్లు నడుస్తున్నాయి.
దాదాపు 97 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ పూర్తి
ఇప్పటికే అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన భారతీయ రైల్వే బ్రాడ్ గేజ్ విద్యుదీకరణను చేపట్టింది. దేశ వ్యాప్తంగా ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ లో దాదాపు 97 శాతం విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వందశాతం గ్రీన్ రైల్ నెట్ వర్క్ లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకూ బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ లోని 45,200 కిలోమీటర్ల లైన్లను విద్యుదీకరణ చేసినట్లు వెల్లడించారు. డీజిల్ తో పోల్చితే ఎలక్ట్రిక్ విధానంలో పర్యావరణానికి మేలు కలగడంతో పాటు ఖర్చు దాదాపు 70 శాతం తగ్గుతుందన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం ద్వారా గ్రీన్ రైల్వేస్ లో గ్లోబర్ లీడర్ గా ఎదగాలన్నదే తమ లక్ష్యమని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Read Also: గిన్నిస్ రికార్డుల్లోకి ఢిల్లీ రైల్వే స్టేషన్, కారణం ఏంటో తెలుసా?