Delhi Train Cancellation Update: రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఢిల్లీలో నిరసన కార్యక్రమాల నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేసిన అధికారులు.. ఇవాళ్టి (అక్టోబర్ 11) నుంచి అన్ని రైలు సర్వీసులు సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని ప్రకటించారు. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులకు కలిగిన ఇబ్బందుల నేపథ్యంలో తాజా ప్రకటన చేసింది. ఇప్పటికే రద్దు చేసిన రైళ్లకు అదనంగా ఇతర సర్వీసులను రద్దు చేసే ఆలోచన లేదని ఉత్తర రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
అక్టోబర్ 11 అర్ధరాత్రి 12 గంటల నుంచి రైళ్లు సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని ఉత్తర రైల్వే సీపీఆర్వో హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఇప్పటికే రద్దు చేసిన రైళ్లకు సంబంధించి ప్రయాణికులు తమ టికెట్ స్టేటస్‌ను మరోసారి చెక్ చేసుకోవాలని సూచించారు. సాధారణ షెడ్యూల్ కొనసాగుతుందని చెప్పినప్పటికీ, రైలు ప్రయాణ వివరాలను అధికారికంగా నిర్ధారించుకోవాలన్నారు.
ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల నిరసన కార్యక్రమం నేపథ్యంలో రైల్వే శాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 10న మొత్తం 245 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్లలో 75 మెయిల్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉండగా, మరో 170 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ల పరిసరాల్లో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో రైల్వే ట్రాఫిక్ అడ్వైజరీలు జారీ చేసింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయలుదేరి, అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ స్టేషన్లకు చేరుకోవాల్సిన కొన్ని మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లను వాటి ప్రారంభ స్టేషన్ల నుంచే రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు మార్గమధ్యంలో, స్టేషన్ల దగ్గర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని నివారించేందుకు అధికారులు ప్రయత్నించారు.
ఈ రద్దుల ప్రభావం ప్రీమియం రైళ్లపైనా పడింది. రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ రైలు సర్వీసులు కూడా ఎఫెక్ట్ అయ్యాయి వాటిలో అక్టోబర్ 9న బయలుదేరాల్సిన 12301 హౌరా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్, 12313 సీల్దా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. ఈ రద్దుల కారణంగా ముందుగా ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ప్రయాణికులు తమ షెడ్యూల్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. రైళ్ల రద్దు కారణంగా సుమారు 5,000 మంది ప్రయాణికులు తమ రైళ్లను అందుకోలేకపోయినట్లు సమాచారం. అయితే, ఇవాళ్టి నుంచి రైలు సర్వీసులు సాధారణ షెడ్యూల్‌లో నడుస్తాయని అధికారులు ప్రకటించడంతో ప్రయాణికులకు కొంత ఊరట లభించింది.
Read Also: రన్నింగ్ ట్రైన్ లోనూ కన్ఫార్మ్ టికెట్ పొందొచ్చు, IRCTCలో ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి!