Visakhapatnam-Bengaluru Vande Bharat Sleeper: దేశ వ్యాప్తంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం 135కు పైగా రైళ్లు పలు మార్గాల్లో నడుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ పలు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి 10 అత్యాధునిక వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. వాటిలో 2 రైళ్లను సికింద్రాబాద్ కేంద్రంగా నడపనున్నట్లు దాదాపు కన్ఫార్మ్ అయ్యింది. ఇప్పుడు మరోరూట్ లోనూ వందేభారత్ స్వీపర్ రైలును ప్రారంభించాలని డిమాండ్ వినిపిస్తోంది.
విశాఖ- బెంగళూరు మధ్య వందేభార్ స్లీపర్?
అధిక రద్దీ ఉన్న విశాఖపట్నం-బెంగళూరు నడుమ వందేభారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకుజోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) సభ్యుడు కాంచుమూర్తి ఈశ్వర్.. విశాఖపట్నం- బెంగళూరు, తిరుపతి- చెన్నై మార్గాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని కోరారు. ఈ మేరకు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్‌లను కోరారు. ఈ మార్గంలో నిరంతరం అధిక సంఖ్యలో ప్రయాణీకుల సంఖ్య ఉంటుందన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం- బెంగళూరులో పని చేస్తున్న ఉత్తరాంధ్ర టెక్ నిపుణులకు వందేభారత్ స్లీపర్ రైలు రాత్రిపూట మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉందన్నారు. విశాఖ-బెంగళూరు వందేభారత్ స్లీపర్ రైలు విశాఖ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, సికింద్రాబాద్, బెంగళూరు.. నగరాలను కనెక్ట్ చేసేలా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
దువ్వాడలో హాల్టింగ్ ఇవ్వాలని డిమాండ్
అటు విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్లు 20833/20834, 20707/20708) రైళ్లకు దువ్వాడలో షెడ్యూల్డ్ హాల్టింగ్ ఇవ్వాలని కంచుమూర్తి ఈశ్వర్ రైల్వే అధికారులను రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం దువ్వాడ స్టేషన్ కేంద్రంగా దక్షిణ, పశ్చిమ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ హాల్టింగ్ ఇస్తే పెద్ద సంఖ్యలో ప్రయాణీకులకు మేలు చేస్తుందన్నారు. అటు విశాఖపట్నం, కొల్లం, షిర్డీ, గాంధీధామ్, వారణాసి, చెన్నైకి వెళ్తున్న వీకెండ్ రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో సర్వీసులను అప్ గ్రేడ్ చేయాలన్నారు. ఎక్కువ డిమాండ్ ఉన్నా ప్రస్తుతం 11 కోచ్‌లతో నడుస్తున్న విశాఖపట్నం-తిరుపతి(22707) రైలుకు కోచ్‌ల సంఖ్యను పెంచాలన్నారు ఈశ్వర్.
Read Also: బుల్లెట్ ట్రైన్ కు ముహూర్తం ఫిక్స్.. పరుగులు పెట్టేది ఆ రోజు నుంచే!
రాత్రిపూట ప్రయాణాలకు అనుగుణంగా వందేభారత్ స్లీపర్
త్వరలో అందుబాటులోకి రాబోతున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రత్యేకంగా సుదూర రాత్రి ప్రయాణాలకు అనుగుణంగా రూపొందించారు. స్లీపర్ బెర్త్‌లు, ఎక్కువ ఆన్ బోర్డ్ సౌకర్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం పగటిపూట మాత్రమే నడిచే వందే భారత్ మోడల్‌ల మాదిరిగా కాకుండా, స్లీపర్ వెర్షన్ అధిక వేగంతో ప్రయాణించనుంది. ఈ రైలు గంటకు 180 కి.మీ వరకు వెళ్తుంది. ఇప్పటికే ఉన్న రైళ్లకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ ను ప్రవేశపెట్టడం వల్ల పెరుగుతున్న రద్దీని తగ్గించే అవకాశం ఉంటుంది.