Underground Cabling: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలోని 11 డివిజన్లలో యూజీ కేబుళ్ల ఏర్పాటుకు తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) రంగం సిద్ధం చేసింది. భారీ స్థాయిలో చేపట్టనున్న ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని సంస్థ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని, గడువు పొడిగింపు కోరవద్దని ప్రీ-బిడ్ సమావేశంలో వెండర్లకు సంస్థ స్పష్టంచేసినట్లు సమాచారం.
దీంతో వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టును నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయడం కాంట్రాక్టర్లకు సవాల్‌గా మారనుంది. యూజీ కేబుల్ పనులకు సంబంధించి శుక్రవారం(ఈనెల 25) నుంచి బిడ్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 12 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు వెండర్లకు అవకాశం కల్పించారు. కాగా గురువారం నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 50 మంది వరకు ప్రతినిధులు హాజరైనట్లు సంస్థ స్పష్టంచేసింది. ప్రాజెక్టు పనుల పరిధి, సాంకేతిక అంశాలు, అమలు విధానం, గడువులు తదితర అంశాలపై వెండర్లు సంస్థ అధికారులను వివరాలు కోరగా.. పలు అంశాలపై అధికారులు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.
హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలోని 11 డివిజన్లలో ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్ల స్థానంలో భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత ఆధునీకరించడం, రహదారులపై కనిపించే విద్యుత్ వైర్లు, స్తంభాలను తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో పనులు చేపట్టాల్సి ఉండటంతో ప్రాజెక్టు అమలు అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ ఓవర్‌హెడ్ లైన్లకు స్వస్తి పలికి, కీలక విద్యుత్ లైన్లను భూగర్భంలోకి మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన అండర్‌గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Also read: రోడ్డు పక్కన వాటర్ బాటిల్ కొంటున్నారా? ఈ 10 సెకన్ల ట్రిక్ తెలిస్తే షాక్ అవుతారు
మొదటి విడత పనులకు ప్రభుత్వం ఆమోదించిన రూ.4,051 కోట్ల అంచనా వ్యయం కేవలం ఆరేడు నెలల్లోనే రూ.5,756 కోట్లకు పెంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా వందల కోట్ల రూపాయల మేర అంచనా వ్యయం పెరగడానికి కారణాలేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పనుల్లో ఎలాంటి మార్పులు లేకున్నా.. ఇంత భారీ మొత్తంలో అడ్డగోలుగా పెంచుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎందుకంటే ఏకంగా 42 శాతం పెంచుకోవడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే జరిగిందా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌ను ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్లు లేని నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, అప్పటి డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తదితరులు బెంగళూరులో అమలుచేస్తున్న అండర్‌గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టును పలు దఫాలుగా పరిశీలించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం ఉన్న 33 కేవీ, 11 కేవీ ఓవర్‌హెడ్ లైన్ల స్థానంలో అండర్‌గ్రౌండ్ కేబుళ్లను ఏర్పాటు చేయడానికి మొత్తం సుమారు రూ.14,725 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి విడతలో 2,396 సర్క్యూట్ కిలోమీటర్ల 11 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్, 180 సర్క్యూట్ కిలోమీటర్ల 33 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయడంతో పాటు ఇతర అనుబంధ విద్యుత్ మౌలిక వసతుల కోసం రూ.4,051 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ లో జీవో జారీ చేసింది.
కేబులింగ్ పనులను సాధ్యమైనంత వరకు హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే రోడ్లను పూర్తిగా తవ్వకుండా, ప్రత్యేక డ్రిల్లింగ్ సాంకేతికత ద్వారా భూగర్భంలో కేబుళ్లను ఏర్పాటు చేయడం ఈ విధానం ఉద్దేశం. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ ఈసీ) నుంచి రుణం రూపంలో సమకూర్చుకునే ప్రతిపాదన ఉంది. అయితే రూ.4,051 కోట్లకు ఆమోదం పొందిన తొలి విడత ప్రాజెక్టు వ్యయం సరిపోదని పేర్కొంటూ, దానిని రూ.5,756 కోట్లకు పెంచేందుకు కొత్త డీపీఆర్ రూపొందించి ఆమోదించాలని ఎస్పీడీసీఎల్ ఈ ఏడాది జూన్ లో రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్ ఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
అంటే కేవలం ఆరేడు నెలల వ్యవధిలోనే ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1,705 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ వ్యవధిలో ప్రాజెక్టు అంచనా వ్యయం ఇంత భారీగా పెరగడానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు రూ.3500 కోట్లు అంచనా వ్యయమే అవుతుందని విశ్వసనీయ సమాచారం. కానీ భవిష్యత్ లో మెటీరియల్ కాస్ట్ లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా రూ.4051 కోట్ల అంచనా వ్యయంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే కొద్ది నెలలకే ఈ వ్యయాన్ని రూ.5756 కోట్లకు పెంచుకున్నారనే ప్రచారం విమర్శలకు దారితీసింది. అంతేకాకుండా ఈ పనులను ఒకే కాంట్రాక్టర్ కు ఇవ్వకుండా 34 ముక్కలుగా చేసి పని విభజన చేయడంపైనా అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.
Also read: టాటా నంబర్ వన్.. మహీంద్రా నెక్స్ట్.. విన్‌ఫాస్ట్ స్పీడ్ చూస్తే షాక్!
హైదరాబాద్‌లో యూజీ కేబుళ్ల ఏర్పాటు కోసం రోడ్ల తవ్వకాలు, ఇతర శాఖల అనుమతులు, ట్రాఫిక్ నిర్వహణ, ఇప్పటికే ఉన్న డ్రైనేజీ, వాటర్ పైపులైన్లు, ఇతర యుటిలిటీలతో సమన్వయం వంటి అనేక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్క అంశంలో జాప్యం జరిగినా మొత్తం పనుల వేగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు ప్రాజెక్టు విషయంలో ఎలాంటి ఎక్స్‌టెన్షన్‌కు అవకాశం లేదని ఎస్పీడీసీఎల్ ముందుగానే స్పష్టంచేయడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే బిడ్ల ప్రక్రియ వచ్చే నెల 12తో ముగియనుంది. అనంతరం టెండర్ల పరిశీలన, వెండర్ల ఎంపిక, వర్క్ ఆర్డర్ల జారీ, పనుల ప్రారంభం వంటి ప్రక్రియలు చేపట్టాల్సి ఉంటుంది. ఒకవైపు భారీగా పెరిగినట్లు చెబుతున్న అంచనా వ్యయం.. మరోవైపు రెండేళ్లకే పరిమితమైన గడువు.. ఇంకోవైపు ఎక్స్‌టెన్షన్‌కు అవకాశం లేదన్న సంస్థ వైఖరి నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై ఉత్కంఠ నెలకొంది. వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న యూజీ కేబుల్ పనులను ఎస్పీడీసీఎల్ అనుకున్న సమయానికి పూర్తి చేయగలదా? లేదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం నిర్వహించిన అండర్ గ్రౌండ్(యూజీ) కేబుల్ ప్రాజెక్టు ప్రీ-బిడ్ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత ఆధునికంగా, విశ్వసనీయంగా, అంతరాయరహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో టీజీఎస్పీడీసీఎల్ చేపట్టనున్న ప్రతిష్టాత్మక యూజీ కేబుల్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ సమావేశం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా కేబుల్ తయారీ సంస్థలు, జాయింటింగ్ కిట్ తయారీదారులు, నిర్మాణ సంస్థలు, ప్రాజెక్టు అమలు సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, అమలు మరియు నాణ్యతా ప్రమాణాల అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు లక్ష్యాలు, అమలు విధానం, నాణ్యతా ప్రమాణాలు, సమయపాలన, విద్యుత్ వ్యవస్థ విశ్వసనీయత పెంపుపై సమగ్ర వివరణ అందించారు. హైదరాబాద్ నగర ప్రతిష్టకు సంబంధించిన ఈ ప్రాజెక్టులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అత్యుత్తమ ప్రమాణాలతో పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రీ-బిడ్ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు టెండర్ నిబంధనలు, అర్హత ప్రమాణాలు, మొబిలైజేషన్ అడ్వాన్స్, బ్యాంకు గ్యారంటీలు, సాంకేతిక స్పెసిఫికేషన్లు, జాయింటింగ్ కిట్లు, అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థలు, పోర్టల్ సంబంధిత అంశాలపై పలు ప్రశ్నలు, సూచనలు చేశారు. వాటన్నింటినీ టీజీఎస్పీడీసీఎల్ అధికారులు నమోదు చేసుకుని, అవసరమైన అంశాలపై లిఖితపూర్వక స్పష్టత, అధికారిక సమాధానాలు అందిస్తామని తెలిపారు. సాంకేతిక అంశాలకు సంబంధించిన వెండర్ల సందేహాలను డైరెక్టర్(ప్రాజెక్ట్స్, ఐటీ) శివాజీ, చీఫ్ ఇంజనీర్(ప్రాజెక్ట్స్) మోహన్ వివరంగా నివృత్తి చేశారు.
ప్రాజెక్టు అమలు విధానం, సాంకేతిక ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ చర్యలు, ఫీల్డ్ స్థాయి సవాళ్లు, టెండర్ నిబంధనలపై సమగ్ర వివరణ అందించారు. సమావేశంలో జరిగిన పారదర్శక చర్చలు, అధికారుల స్పందన, సూచనలను సానుకూలంగా స్వీకరించిన విధానంపై ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా అమలు కానున్న ఈ ప్రాజెక్టు విజయవంతమైతే హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తుందని, తెలంగాణకు, ప్రజా ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మరింత మంచి గుర్తింపు తీసుకురానుందని టీజీఎస్పీడీసీఎల్ అధికారులు పేర్కొన్నారు.
Also read: రోడ్డు పక్కన వాటర్ బాటిల్ కొంటున్నారా? ఈ 10 సెకన్ల ట్రిక్ తెలిస్తే షాక్ అవుతారు