Indian Railways: భారతీయ రైల్వే సంస్థ రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. సంప్రదాయ రైళ్లు ఆధునిక హంగులను అద్దుకుంటున్నాయి. సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. త్వరలోనే గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. మరోవైపు ముంబై-అహ్మదాబాద్ నడుమ బుల్లెట్ రైలు పరుగులు తీయబోతోంది. ఈ కారిడార్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది.
రైళ్లు ఆలస్యం కావడం కామన్ అయినా..
ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా, రకరకాల కారణాలతో రైళ్లు ఆలస్యం అవుతుంటాయి. వాతావరణ పరిస్థితులు, సిగ్నలింగ్ సమస్యలు, ట్రాకులకు సంబంధించిన సమస్యలు లేదంటే మరమ్మతుల కారణంగా రైళ్లు ఆలస్యం అవుతుంటాయి. సాధారణంగా కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు లేటుగా నడిచే అవకాశం ఉంటుంది. కానీ, ఓ రైలు తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఏకంగా మూడున్నర సంవత్సరాలకు పైగా పట్టడం విశేషం. భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఆలస్యంగా నడిచిన రైలు గుర్తింపు తెచ్చుకుంది.
మూడున్నర ఏండ్లు ఆలస్యమైన రైలు
విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్ లోని బస్తీకి చేరుకోవడానికి ఓ గూడ్స్ రైలుకు 3 సంవత్సరాల 8 నెలల 7 రోజులు పట్టింది. 2014 నవంబర్ 10న వైజాగ్ నుంచి 1,316 డీఏపీ బస్తాలతో బయల్దేరిన వ్యాగన్, 2018 జూలై 25న బస్తీ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ వ్యాగన్ ను చూసి రైల్వే అధికారులు, సిబ్బంది షాక్ కు గురయ్యారు. వాస్తవానికి ఈ రైలు వైజాగ్ నుంచి బస్తీకి చేరుకోవడానికి సుమారు 42 గంటల సమయం పడుతుంది. కానీ, ఆ రైలు అన్ని ఏళ్లు ఎందుకు ఆలస్యం అయ్యిందనేది ఇప్పటికీ ఓ మిస్టరీ! బస్తీకి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రామచంద్ర గుప్తా విశాఖలోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కంపెనీ నుంచి సుమారు 14 లక్షల విలువ చేసే డీఏపీ బస్తాలను కొనుగోలు చేశాడు. ఆ బస్తాలను వైజాగ్ నుంచి బస్తీకి తీసుకొచ్చేందుకు రైల్వే అధికారులతో మాట్లాడి ఓ వ్యాగన్ బుక్ చేసుకున్నాడు. ఈ ఎరువుల బస్తాలు విశాఖ నుంచి షెడ్యూల్ ప్రకారం బయల్దేరింది. కానీ, ఈ రైలు అనుకున్న సమయానికి గమ్య స్థానానికి చేరుకోలేదు. వ్యాపారి రామచంద్ర గుప్తా ఆందోళన వ్యక్త చేశాడు. వ్యాగన్ ఎందుకు రాలేదో చెప్పాలని రైల్వే అధికారులను అడిగినా సరైన సమాధానం రాలేదు. ఆయన రోజూ స్టేషన్ కు రావడం, అధికారులను అడగడం, వెళ్లడం కామన్ అయ్యింది. అయితే, ఈ రైలు మార్గ మధ్యంలో తప్పిపోయినట్లు అధికారులు భావించారు.
మూడున్నర ఏండ్లకు బస్తీ స్టేషన్ లో ప్రత్యక్షం
ఈ గూడ్స్ వ్యాగన్ గురించి నెమ్మది రైల్వే అధికారులు నెమ్మదిగా మర్చిపోయారు. చివరకు ఈ రైలు జులై 2018లో యూపీలోని బస్తీ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అప్పటికే అందులో ఉన్న ఎరువుల బస్తాలు అన్నీ చెడిపోయాయి. లక్షల రూపాయల ఎరువులు పనికిరాకుండా పోయాయి. రామచంద్ర గుప్తా వాటిని తీసుకునేందుకు నిరాకరించాడు. అయితే, ఈ రైలు మూడున్న ఏండ్ల పాటు ఎందుకు ఆలస్యం అయ్యింది? అన్ని రోజులు ఎక్కడపోయింది? అనేది ఇప్పటికీ తెలియకపోవడం విశేషం.
Read Also: ఈ రైలు పొడవు 3.5 కి.మీలు.. ఎన్ని కోచ్ లు ఉంటాయో తెలుసా?