IndiGo flight: ఏదో విధంగా విమానాల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇండిగో విమానంపై ప్రతికూల వాతావరణం కారణంగా ఓ పిడుగు పడింది. సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగింది. ఘటన తర్వాత సదరు విమానం లక్నోలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అసలు ఎలా జరిగింది?
పాట్నా నుండి లక్నో వెళ్తున్న ఇండిగో విమానం ఊహించని ఘటన ఎదురైంది. ప్రతికూల వాతావరణం వల్ల విమానాన్ని పిడుగు హిట్ కొట్టింది. ఆ ఘటన సమయంలో విమానం దాదాపు 17000 అడుగుల ఎత్తులో ఉంది. ఫలితంగా పిడుగుపాటు వల్ల విమానం ముక్కుభాగం డ్యామేజ్ అయ్యింది. అయితే విమానం ల్యాండింగ్ సమయంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
6E 925 నెంబరు గల ఇండిగో విమానం బుధవారం మధ్యాహ్నం 3.10 గంటలకు పాట్నా ఎయిర్‌పోర్టు నుండి బయలుదేరింది. ఆ విమానం సాయంత్రం 4.20 గంటలకు లక్నోలో ల్యాండ్ కావాలి. అత్యవసర పరిస్థితి కారణంగా విమానం ముందుగానే ల్యాండైంది. పిడుగు హిట్ కొట్టిన సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ పరిస్థితిని అదుపులోకి తెచ్చి విమానాన్ని తిరిగి లక్నో విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
ఎవరికీ గాయాలు కాలేదని, సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని లక్నో విమానాశ్రయంలో నిలిపివేశారు ఆ సంస్థ. ప్రస్తుతం ఇంజనీర్ల బృందం విమానాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసింది. విమానం దెబ్బతినడంతో ఇండిగో ప్రయాణీకుల కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసింది. ప్రయాణీకులంతా సాయంత్రం సుమారు 6.22 గంటలకు మరొక విమానంలో అహ్మదాబాద్‌కు బయలుదేరారు. విమానాలపై పిడుగులు పడడం ఇదేం తొలిసారి కాదు.
ALSO READ: ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!
జూన్ 19న కోల్‌కతా విమానాశ్రయంలో నిలిపి ఉంచిన మరో ఇండిగో విమానంపై పిడుగు పడింది. అగర్తలాకు వెళుతున్న విమానంపై పిడుగు పడటంతో దాని విద్యుత్ వ్యవస్థ డ్యామేజ్ అయ్యింది. ఈ ఘటన తర్వాత విమానయాన సంస్థ 141 మంది ప్రయాణికులను, ఆరుగురు సిబ్బందిని విమానం నుంచి దించేసింది. ఆ తర్వాత ఆ ప్రయాణికులను మరో విమానంలో అగర్తలాకు తరలించింది. ఘటన తర్వాత ఇద్దరు గ్రౌండ్ స్టాఫ్ సభ్యులను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించిన విషయం తెల్సిందే.