Hyderabad and Srisailam Tour Package: అక్టోబర్ లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌తో పాటు మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకునేలా ఈ విమాన యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది. హోటల్ వసతి, భోజనం, స్థానిక రవాణా సహా పలు సదుపాయాలను ఈ ప్యాకేజీలో అందిస్తోంది.
ఐఆర్‌సీటీసీ ప్రకటించిన ఈ ప్యాకేజీ పేరు ‘హైదరాబాద్ విత్ మల్లికార్జున జ్యోతిర్లింగ’. 2026 అక్టోబర్ 23 నుంచి 27 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. మొత్తం నాలుగు పగళ్లు, ఐదు రాత్రుల పాటు పర్యటన ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి విమాన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ టూర్ ద్వారా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ఆకర్షణలను సందర్శించవచ్చు. ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునేవారితో పాటు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి కూడా ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.
ఈ పర్యటనలో భాగంగా భక్తులు శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అలాగే యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ, చార్మినార్, సురేంద్రపురి వంటి ప్రాంతాలను సందర్శించేలా యాత్రను రూపొందించారు. ఒకవైపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దర్శనం, మరోవైపు హైదరాబాద్ చారిత్రక వైభవం, ఆధునిక పర్యాటక ప్రాంతాలను చూసే అవకాశం ఈ ప్యాకేజీ ప్రత్యేకత. తక్కువ సమయంలో పలు ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీలో పలు సేవలను అందిస్తోంది. లక్నో నుంచి విమాన ప్రయాణం, హోటల్ వసతి, బ్రేక్ ఫాస్ట్, రాత్రి భోజనం, స్థానిక ఏసీ వాహనాల్లో రవాణా, నిర్ణయించిన పర్యాటక ప్రాంతాల సందర్శన, టూర్ ఎస్కార్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ప్రయాణికుల సంఖ్య, రూమ్ షేరింగ్ ను బట్టి ప్యాకేజీ ధరలు మారుతాయి.
సింగిల్ ఆక్యుపెన్సీ: ఒక్కరికి రూ.51,500
డబుల్ ఆక్యుపెన్సీ: ఒక్కరికి రూ.43,500
ట్రిపుల్ ఆక్యుపెన్సీ: ఒక్కరికి రూ.42,500
5–11 ఏళ్ల పిల్లలకు (బెడ్ తో): రూ.37,900
5–11 ఏళ్ల పిల్లలకు (బెడ్ లేకుండా): రూ.36,800
2–5 ఏళ్ల పిల్లలకు (బెడ్ లేకుండా): రూ.22,300
ముందుగా బుక్ చేసుకున్న వారికే అవకాశం కల్పిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు లక్నోలోని గోమతి నగర్, పర్యటన్ భవన్‌లో ఉన్న ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctc.com ద్వారా వివరాలు తెలుసుకుని బుకింగ్ చేసుకోవచ్చు.
Read Also: జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!