Train Ticket Transfer Rules: రైలు ప్రయాణానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నా.. అప్పుడప్పుడు అనుకోని కారణాలతో ప్రయాణం చేయలేని పరిస్థితి రావచ్చు. అలాంటి సమయంలో టికెట్ ను క్యాన్సిల్ చేస్తే కొంత డబ్బును లాస్ కావాల్సి వస్తుంది. అయితే, తాజాగా నిబంధనల ప్రకారం టికెట్ ను రద్దు చేయకుండా.. మరో వ్యక్తి పేరు మీదికి బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే. కన్ఫర్మ్ రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుడు వెళ్లలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు టికెట్‌ను మార్చుకోవచ్చు. అయితే, ఇందుకోసం కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కన్ఫర్మ్ టికెట్ ను ప్రయాణికుడి కుటుంబంలోని తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, కుమారుడు, కుమార్తె, భార్య లేదంటే భర్త పేరుకు మార్చుకునే అవకాశం ఉంది. ఇందుకోసం రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు రాతపూర్వకంగా అధికారులకు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. టికెట్‌ను ముందుగా బుక్ చేసిన రిజర్వేషన్ కౌంటర్ లోనే ఈ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ రిజర్వేషన్ టికెట్ తో పాటు, పేరు మార్చాల్సిన వ్యక్తికి సంబంధించిన ఐడీ ప్రూఫ్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
విద్యార్థుల విషయంలోనూ టికెట్ బదిలీకి అవకాశం ఉంది. ఒక విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు కలిసి ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు.. వారిలో కొందరు వెళ్లలేకపోతే, అదే విద్యాసంస్థకు చెందిన ఇతర విద్యార్థులకు ఆ టికెట్లను మార్చుకోవచ్చు. అయితే విద్యాసంస్థ నుంచి రాతపూర్వకంగా రిక్వెస్ట్ రావాల్సి ఉంటుంది. రైలు బయలుదేరే సమయానికి కనీసం 48 గంటల ముందు రిజర్వేషన్ కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా మార్చే టికెట్ల సంఖ్య మొత్తం బృందంలోని ప్రయాణికుల సంఖ్యలో 10 శాతానికి మించకూడదు.
పెళ్లి కార్యక్రమాల కోసం పెద్ద సంఖ్యలో బంధువులు కలిసి రైల్లో ప్రయాణించడం సాధారణమే. ఇలాంటి బృందంలో ఎవరైనా చివరి నిమిషంలో ప్రయాణం చేయలేకపోతే.. వారి టికెట్లను అదే వివాహ బృందంలోని ఇతరులకు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి. కనీసం 48 గంటల ముందే ఈ రిక్వెస్ట్ అందించాలి. అయితే, ఆ బృందంలోని మొత్తం సంఖ్యలో 10 శాతానికి మించకూడదు.
ఎన్‌సీసీ క్యాడెట్లల్లోనూ ఈ అవకాశం ఉంటుంది. ఒక క్యాడెట్ ప్రయాణించలేని పరిస్థితి వస్తే.. అదే టీమ్ లోని మరో క్యాడెట్ పేరుకు టికెట్‌ను మార్చుకోవచ్చు. ఇందుకోసం ఈ టీమ్ ను లీడ్ చేసే అధికారి కనీసం 24 గంటల ముందు దరఖాస్తు చేయాలి. అటు అధికారిక విధుల కోసం ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. ఒక ఉద్యోగి స్థానంలో మరో ప్రభుత్వ ఉద్యోగి ప్రయాణించాల్సి వస్తే.. నిబంధనల ప్రకారం టికెట్‌పై పేరు మార్చుకునే అవకాశం ఉంటుంది.
అయితే, ఈ సదుపాయాన్ని పదేపదే ఉపయోగించుకునే అవకాశం లేదు. కన్ఫర్మ్ డ్ టికెట్‌పై పేరు మార్పును ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు.
Read Also: దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఇదే.. చిన్నది ఎక్కడుందో తెలుసా?