Stone-pelting at Train: దేశంలో రైల్వే చట్టాలను కఠినంగా అమలు చేయబోతున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పలువురు ఆకతాయిలు వాటిపై రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. ఇలాంటి పనుల వల్ల రైల్వేకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లుతోందని అధికారులు గుర్తించారు. అదే సమయంలో ప్రయాణీకులు గాయాలపాలు కావడంతో పాటు భయాందోళనకు గురవుతున్నట్లు గుర్తించారు. అయితే, ఈ పనులు చట్టపరమైన పరిణామాల పట్ల అవగాహన లేకపోవడంతో పాటు కొంతమంది స్థానికులు వినోదం కోసం చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలు
తెలంగాణలోనూ వందేభారత్ రైళ్లపై రాళ్లు విసిరిన ఘటనలు జరిగాయి. ఫలక్‌నుమా నుంచి బుద్వేల్, సీతాఫల్ మండి నుంచి లాల్లగూడ, హఫీజ్‌పేట నుంచి లింగంపల్లి, మహబూబ్‌నగర్ నుంచి మల్కాజ్‌గిరి స్టేషన్లకు వెళ్లే మార్గాల్లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు రైల్వే అదికారులు గుర్తించారు. అంతేకాదు, ఈ మార్గాల్లో రాళ్లు రువ్వే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించడం, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం, పట్టాలపై ప్రమాదకర వస్తువులను ఉంచడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అయితే, ఇలాంటి పనులకు ప్రజలు దూరంగా ఉండాలని రైల్వే పోలీసులు పిలుపునిచ్చారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే, 139కి కాల్ చేయాలని సూచించారు.
ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న రైల్వే అధికారులు
రాళ్లు రువ్వడం లాంటి చర్యలు పాల్పడకుండా విద్యార్థులకు, రైల్వే లైన్ల దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకు రైల్వే పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభావిత సెక్షన్లతో పాటు బ్లాక్ స్పాట్లలో సామాజిక వ్యతిరేక వ్యక్తులు, తాగుబోతులపై రైల్వే చట్టం ప్రకారం రెగ్యులర్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. పట్టాలకు దగ్గరగా ఉన్న మైదానాల్లో పిల్లలు ఆడుకునే గ్రామాల సర్పంచ్ లు, సమీపంలోని హాస్టళ్ల ప్రిన్సిపాల్‌లు, ఇంటి యజమానులకు నోటీసులు అందజేయాలని భద్రతా సిబ్బందిని రైల్వే అధికారులు ఆదేశించారు. తరచుగా ఇలాంటి సంఘటనలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలన్నారు. బ్లాక్ స్పాట్లల దగ్గర నిఘా ఉంచడానికి సిబ్బందిని నియమించాలని సూచించింది. అంతేకాకుండా, ట్రాక్‌సైడ్ నివాస ప్రాంతాలలోని తల్లిదండ్రులలో రాళ్లు రువ్వడం వల్ల కలిగే పరిణామాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. రైల్లో ప్రసవం.. టాయిలెట్ లో బిడ్డ!
రాళ్లు రువ్వితే 5 ఏళ్ల జైలు శిక్ష
రైల్వే చట్టం (సెక్షన్ 153 & 154)లోని సంబంధిత సెక్షన్లు ప్రకారం రైళ్లపై రాళ్లు రువ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు. రాళ్లు రువ్వడం, ట్రాక్ లపై ప్రమాదకర వస్తువులు ఉంచిన వ్యక్తులకు సెక్షన్ 153 ప్రకారం 5 సంవత్సరాల వరకు శిక్ష, సెక్షన్ 154 ప్రకారం 1 సంవత్సరం వరకు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయన్నారు.
Read Also: రైల్లో నీలం, నల్ల బ్యాగులు కనిపిస్తే చాలు మాయం చేస్తారు.. ఎందుకంటే?